శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:26 IST)

మా కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వండి : తల్లిదండ్రుల వినతి

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తమ కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వాలంటూ ఓ జంట న్యాయస్థానాన్ని మొరపెట్టుకుంది. అంటే మెర్సి కిల్లింగ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ చిత్తూరు జిల్లా కోర్టులో దాఖలైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లికి చెందిన ఓ జంటకు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుమార్తె ఉంది. ఆమె మంచానికే పరిమితమైంది. పైగా, ఆ జంటకు ఆర్థిక స్తోమత పెద్దగా లేదు. దీంతో అనారోగ్యం బారినపడిన కుమార్తె పోషణ ఆ జంటకు భారమైంది. 
 
పైగా, దాతల ఆర్థిక సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశామని, ఎవరూ ముందుకు రాలేదన్నారు. అదేసమయంలో రోజురోజుకూ వ్యాధి ముదురుతుండటంతో తమ కళ్ల ముందు బిడ్డపడుతున్న బాధను చూడలేకపోతున్నామని పిటిషన్‌లో కోరారు. అందువల్ల తమ కుమార్తెను హత్యకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును వేడుకుంటున్నారు. అయితే, ఈ పిటిషన్‌కు కోర్టు స్వీకరిస్తుందా? లేదా అన్నది తేలాల్సివుంది.