శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (14:33 IST)

నా భర్తను దారుణంగా హత్య చేశారు.. బెయిల్ ఇవ్వకండి.. అమృత విజ్ఞప్తి

మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం పెను సంచలనానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసు నిందితుడైన మారుతీరావుకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆయన కుమార్తె, ప్రణయ్ భార్య అమృత కోర్టును కోరింది. తన భర్తను అతి కిరాతకంగా హత్య చేయించిన తన తండ్రికి బెయిల్ ఇవ్వరాదని అమృత వేడుకుంది. 
 
కాగా ప్రణయ్‌ పరువు హత్య కేసు నిందితులకు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ చెప్పారు. ప్రణయ్‌ హత్య అనంతరం పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 అబ్దుల్‌బారీ, ఏ5 కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్, ఏ7 శివ బెయిల్‌ కోసం నల్లగొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. వారికి బెయిల్‌ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
 
అమృత వర్షిణి న్యాయమూర్తి హుస్సైబ్‌ హైమద్‌ ఖాన్‌ ఎదుట హాజరై ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బెయిల్‌ ఇస్తే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తమకు రక్షణ ఉండదని ఆమె ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపింది. దీంతో ప్రణయ్ హత్య నిందితులకు బెయిల్ ఇచ్చేది లేదని కోర్టు తేల్చి చెప్పేసింది.