జగనన్న సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే చేతులకు బేడీలే... ఏపీ పోలీసుల అతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. దీనికితోడు ఆస్పత్రుల్లో వైద్య సేవలు, ఆక్సిజగన్ అందక అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 11 మంది చనిపోయారు. అనధికారికంగా 40 మంది వరకు చనిపోయినట్టు మృతుల కుటుంబాలు చెబుతున్నారు.
ఈ క్రమంలో రుయా ఆస్పత్రి ఘటన అనంతరం తిరుపతి పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై హేమవతి అనే కోవిడ్ బాధితురాలు సీఎం జగనన్న సర్కారును ఏకిపారేసింది. ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆమెను అరెస్టు చేసి అలిపిరి స్టేషన్‌కు తీసుక తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా... అక్కడకు చేరుకోగానే మళ్లీ హడావుడిగా హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు.
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన విపక్ష నేతలను అరెస్టు చేయడం సర్వసాధారణం అయిపోయిన సందర్భంలో.. ఇపుడు కోవిడ్ రోగులను కూడా అరెస్టు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులు అరెస్టులు చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తుండటం గమనార్హం.