గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (09:48 IST)

మా జగనన్న అని గెలిపించుకున్న పాపానికి.. బాగా బుద్ధి వచ్చింది...

మా జగనన్న.. మా ప్రభుత్వం అని గెలిపించుకున్న పాపానికి బాగా బుద్ధివచ్చేలా చేస్తున్నారని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఓ మృతుని కుమారుడు గిరిధర్ రావు వాపోతున్నాడు. ఈయన ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఈయన తండ్రి రుయా అస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. 
 
ఈ ఘటనపై గిరిధర్ రావు మాట్లాడుతూ, ఇటీవల మానాన్న పీఎస్‌ రామారావుకు కరోనా వచ్చి.. పూర్తిగా నయమైంది. మళ్లీ సోమవారం ఊపిరాడడం లేదని చెప్పడంతో రుయాస్పత్రికి తీసుకొచ్చాం. సాయంత్రం వరకు అరకొరగా వైద్యం అందించారు. సాయంత్రం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందనడంతో ఎమర్జెన్సీ వార్డుకు మార్చి ఆక్సిజన్‌ పెట్టారు. అలా పెట్టిన అరగంటకే ఆక్సిజన్‌ సరఫరా ఆగింది. 
 
ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని సిబ్బంది హడావుడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొంత సమయానికే ఆక్సిజన్‌ అందక మా నాన్న మృతిచెందాడు. మా జగనన్న, మా ప్రభుత్వం అని గెలిపించుకున్న పాపానికి మాకు బాగా బుద్ధి వచ్చింది. నా కళ్ల ముందే మా నాన్నతోపాటు మరో 20 మంది వరకు చనిపోయారు. 
 
ఆక్సిజన్‌ అందక అరగంటకు పైగా గిలగిల కొట్టుకుంటున్నా ఒక్కరూ స్పందించలేదు. ఆక్సిజన్‌ అయిపోతుందని ముందే తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ విషయాన్ని ముందుగా చెప్పుంటే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకొనే వాళ్లం అంటూ బోరున రోధిస్తున్నాడు.