గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (08:16 IST)

అర్థగంట ఆలస్యమైన ఆక్సిజన్ లారీ... పడకల మీదే గిలగిలా కొట్టుకుని...

తిరుపతిలోని ప్రముఖ రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి  7 గంటల సమయంలో ఆక్సిజిన్ నిల్వలు 3 కేఎల్‌కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా పీడనం (ప్రెషర్‌) అందలేదు. ఫలితంగా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. 
 
మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువ మంది చనిపోయారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లలో ఉన్న బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. "ఆక్సిజన్‌ అందక ఇప్పటి వరకు 11 మంది మరణించారు'' అని సోమవారం రాత్రి పొద్దుపోయాక జిల్లా కలెక్టర్‌ తెలిపారు.
 
ఈ విషాదం కేవలం అరగంటలోనే జరిగింది. సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యధాతథ స్థితికి తీసుకొచ్చారు. కానీ... ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది.
 
తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్‌ అందక గిలాగిలా కొట్టుకుంటూ విగత జీవులుగా మారడంతో బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని నిందిస్తూ... వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. భయాందోళనతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు వచ్చిన పరిస్థితికి చక్కదిద్దారు. 
 
రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11 మంది చనిపోయారని కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటించారు. రాత్రి 10.45కు ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో 700 మందికి ఆక్సిజన్‌ పడకలపై చికిత్స అందిస్తున్నారని, ఐదు నిమిషాలు ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు  రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.