సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 మే 2021 (22:17 IST)

భర్త తాగుబోతు, ఆటోలో వెళుతూ డ్రైవరుతో సాన్నిహిత్యం, కానీ అతడే ఆమెను హత్య చేసాడు

ఆమెకు 35 యేళ్ళు. పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. ఎంతో అన్యోన్యంగా చూసుకునే భర్త. అయితే ఇంటి పక్కనే ఉన్న ఆటో డ్రైవర్‌ ఆమెపై కన్నేసాడు. అసలే లాక్ డౌన్. బజారుకి వెళ్లాల్సి వస్తే అతడి ఆటో ఎక్కుతుండేది. ఇదే అదనుగా అతడు ఆమెను మెల్లగా తనవైపు తిప్పుకున్నాడు. నువ్వే నా సర్వస్వమని ఆమె చెప్పేంత స్థాయికి తీసుకెళ్లాడు. అక్రమ సంబంధం నడిపారిద్దరు. కానీ అతడి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది.
 
తూర్పుగోదావరి జిల్లా కాజూలూరు మండలం శీల పంచాయతీ శివారు శీలలంక ప్రాంతంలో నివాసముంటున్నారు శివరాజు, రమణమ్మ. వీరికి పదేళ్ళ క్రితమే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చే శివరాజు అంటే భార్య రమణమ్మ ఇష్టముండేది కాదు.
 
కష్టపడిన డబ్బులు సంపాదించడం.. ఆ డబ్బులతో తాగి ఇంటికి రావడం ఇదే అలవాటు శివరాజుకు. ఇంటి పట్టునే ఉండేవాడు కాదు. దీంతో రమణమ్మ ఒంటరిగా ఫీలవుతూ ఉండేది. ఇంటి పక్కనే రామరాజు అనే ఆటోడ్రైవర్ ఉన్నాడు. అతని వయస్సు 19 యేళ్ళు. ఇంకా వివాహం కాలేదు. అతడి ఆటోలో వెళ్లేటపుడు కాస్త చనువు ఏర్పడింది.
 
అతనికి దగ్గరైంది. పెళ్ళయి పిల్లలున్న రమణమ్మకు బాగా దగ్గరయ్యాడు రామరాజు. దీంతో వీరి వ్యవహారం కాస్త ఆరునెలల పాటు సాగింది. రామరాజును వదిలి ఉండలేని రమణమ్మ నన్ను ఇంటి నుంచి తీసుకెళ్ళని అతనిపై ఒత్తిడి తెచ్చింది. 
 
తన ఇద్దరు పిల్లల్లో పెద్ద కుమార్తెను ఇంటి దగ్గరే వదిలి చిన్న కుమార్తెను తీసుకుని రామరాజుతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పిఠాపురంలో రొయ్యల చెరువులో ఇద్దరూ పనికి చేరారు. ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే వీరి అక్రమ సంబంధాన్ని 20 రోజుల పాటు కొనసాగించారు.
 
అయితే పనిచేసే చోట రమణమ్మను అక్కడి వారు తిట్టడం మొదలెట్టారు. దీంతో వాళ్ళ నోరు మూయించాలని తనను పెళ్ళి చేసుకోవాలని రామరాజుపై ఒత్తిడి తెచ్చింది. అయితే అందుకు ససేమిరా అన్నాడు రామరాజు. నిన్న మధ్యాహ్నం చేపల చెరువులో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో రమణమ్మను పక్కనే ఉన్న చెరువులో తోసి చనిపోయిన తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.