సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (12:06 IST)

రుయా ఆస్పత్రి లోగుట్టు అంశాలెన్నో.. ఒకే ఒక్క జూనియర్ వైద్యుడు..

తిరుపతి పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలోని మంచి ఆస్పత్రిగా గుర్తింపు పొందిన దావఖానాల్లో రుయా ఆస్పత్రి ఒకటి. కానీ, సోమవారం రాత్రి ఈ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక నిమిషాల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. అయితే, ఆక్సిజన్ అందక చనిపోయింది 11 మంది కాదనీ మరో 18 మంది వరకు ఉన్నారని ప్రాణాలతో బయటపడిన బంధువులు కూడా ఉన్నారు.
 
ఇలాంటి సంచలన విషయాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. చనిపోయింది 11 మంది కాదని.. మొత్తం 29 మంది అని తెలుస్తోంది. మృతి చెందిన 11 మంది బెడ్స్‌తో పాటు తమతో వైద్యం తీసుకుంటున్న మరో 18 మంది బెడ్స్ కూడా ఖాళీగా ఉండటంతో వారంతా మరణించి ఉంటారని రోగులు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం రుయాలో ఒకే ఒక్క జూనియర్ డాక్టర్ ఉన్నట్టు మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితులందరికీ ఆయన ఒక్కరే వైద్యం అందిస్తున్నారు. ఆయనను బాధితుల బంధువులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 
 
ఈ ఆస్పత్రిలో కనీసం దూది కూడా లేదు. పేపర్‌తో రక్తం తుడుస్తున్నారు. సర్జికల్ గ్లోవ్ లేదు. షుగర్ స్ట్రిప్‌లు లేవు. మందులు లేవు. లోపల పరిస్థితిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వైద్యులు సైతం వచ్చి తమకు చికిత్సను అందించాలని కోరుతున్నారు. 
 
మరోవైపు, రుయాలో 11 మంది చనిపోవడం వెనుక పూర్తి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. చెన్నై నుంచి రుయా ఆస్పత్రికి రాత్రి 7 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ రాగా 7.30 గంటలకు ఫిల్లింగ్ ప్రారంభించారు. దీంతో ఆక్సిజన్ సఫరాలో ఒత్తిడి తగ్గిపోయింది. 
 
రాత్రి 7.40 గంటలకు తమ వాళ్లకు ఏదో అయిందని రోగుల బంధువులు గుర్తించారు. రాత్రి 7.45 గంటలకు కొందరు రోగులు ప్రాణాలు విడిచారు. రాత్రి 7.50 గంటలకు రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. రాత్రి 8.15 గంటలకు నర్సులు పారిపోగా, రాత్రి 11 గంటలు కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.