తిరుపతి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన మహిళ, ఆ తర్వాత?
తిరుపతి రైల్వేస్టేషన్లో మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. స్టేషన్లో ట్రైన్ ఆగకముందే దిగాలని ప్రయత్నం చేయడంతో కాలుజారి ట్రైన్‌కు మధ్యలో పడిపోయింది. అదే టైంలో ఫ్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సతీష్ చాకచక్యంగా ఆమెను బయటకు లాగాడు.
దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. గాజువాకకు చెందిన భార్యాభర్తలు తిరుమల శ్రీవారి దర్సనార్థం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో నిన్న సాయంత్రం వైజాగ్ నుంచి బయలుదేరారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
అయితే గాఢనిద్రలో ఉన్న భార్యాభర్తలు రైలు తిరుపతి రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాంపై ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. రైలు కదులుతుండగా ఉన్నట్లుండి మహిళకు మెలుకువ వచ్చింది. భర్తకు చెప్పి నిద్రలేపే లోపే రైలు కదిలింది.
ఆతృతగా రైలు దిగేందుకు మహిళ ప్రయత్నించి చివరకు ఫ్లాట్‌ఫాం కింద పడిపోతుండగా విధుల్లో ఉన్న సతీష్ అనే రైల్వే పోలీసు చాకచక్యంగా ఆమె ప్రాణాలను కాపాడాడు. సతీష్‌ను రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభినందించారు.