కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసు.. మరో నిందితుడి అరెస్ట్
సంచలనం సృష్టించిన హైదరాబాద్ కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని కొద్ది రోజుల కిందటే అరెస్ట్ చేయగా.. రెండో వ్యక్తి పారిపోయాడు.
కాల్పులకు పాల్పడిన గన్ పరారైన దోపిడి దొంగ వద్దే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు మొదటి నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్‌లోని అతని గ్రామంలో నిఘా పెట్టారు.
నిందితుడు స్వగ్రామం రాగానే అక్కడే అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన తుపాకి, ద్విచక్రవాహనం ఎక్కడి నుంచి వచ్చాయి. దోపిడీకి ఎవరైనా సహకరించారా..? అనే అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఐదు రోజుల క్రితం కూకట్పల్లిలోని పటేల్కుంట పరిధిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద ఇద్దరు ఆగంతుకులు ద్విచక్రవాహనంపై వచ్చి దోపిడీకి పాల్పడ్డారు.
ఏటీఎంలో నగదు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.5లక్షలు ఎత్తుకు పోయారు. ఈ ఘటనలో ఏటీఎం వద్ద సెక్యురీటీగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.