పని చేస్తే ప్రశంస... తప్పు చేస్తే శిక్ష... డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
దేశ రాజకీయ చరిత్రలోనే తొలిసారి గిరిజనులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పాటు కనీసం ఒక గిరిజన సభ్యుడిని మంత్రిగా కూడా చేయలేకపోయిందని ఆరోపించారు.
నాటి ముఖ్యమంత్రి కనీసం గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయలేక పోయారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజన జీవితాలలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో సిఎం ఉన్నారన్నారు. గురువారం సచివాలయంలో వేదపండితుల ఆశీర్వచనం మధ్య తన ఛాంబర్‌లోకి ప్రవేశించిన ఉప ముఖ్యమంత్రి పూజాదికాలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు.
బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం శ్రీవాణి కమ్యునిటీ వర్కర్లకు జీతాల పెంపుకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేసారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు ఈ విషయం గురించి మంత్రికి వివరించి తొలి సంతకం చేయించారు. మరోవైపు గిరిజన ప్రాంతాలలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సుమారు రూ.19.97 కోట్లను మౌళిక సదుపాయాల అభివృద్దికి గాను పరిపాలనా పరమైన ఆమోదం ఇస్తూ మంత్రి రెండో సంతకం చేసారు.
ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజన సంక్షేమం విషయంలో సిఎం సంకల్పానికి అనుగుణంగా మేము ముందడుగు వేస్తా మన్నారు. మానిఫెస్టో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని, వైఎస్ఆర్ పెళ్లి కానుకగా రూ.లక్ష రూపాయల బహుమతి, గిరిజన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్త్ , గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా మార్పు వంటి విషయాలలో తాము చెప్పింది చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేసారు.
సిఎం గిరిజన సంక్షేమం విషయంలో ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారని, కమ్యునిటీ హెల్త్ వర్కర్‌లు ఆశా వర్కర్ల మాదిరే పనిచేస్తున్నప్పటికీ వారికి కేవలం రూ.400 మాత్రమే చెల్లిస్తున్నారన్నవిషయం తెలుసుకుని, తొలి క్యాబినేట్ భేటీలోనే వారి వేతనాలను రూ.4000లకు పెంచారన్న విషయాన్ని శ్రీవాణి గుర్తు చేసారు. గిరిజన సాంప్రదాయాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని, ఇక్కడి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తామని వివరించారు.
గిరిజన ప్రాంతాలలో ఐటిడిఎ ద్వారా పరిపాలన జరుగుతుండగా, అక్కడ పాలనా పరమైన సంస్కరణలను తీసుకురానున్నామన్నారు. సమర్ధులైన అధికారుల సేవలను సద్వినియోగం చేసుకుంటామని, మంచి చేసేవారిని సన్మానిస్తామని, అదే క్రమంలో తప్పు చేస్తే ఉపేక్షించబోమని, వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.
గిరిజన సంక్షేమ శాఖను ఇతర శాఖలకు ఆదర్శ ప్రాయంగా తీర్చిదిద్దుతామని, నాటి సిఎం వైఎస్ఆర్‌ను ఏలా గిరిజనులు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో తదనుగుణంగానే నేటి పరిపాలన కూడా ఉండబోతుందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి జీవిత భాగస్వామి శత్రుచర్ల పర్షిత్ రాజు, జాయింట్ సెక్రటరీ నాయక్, ట్రైకార్ ఎండి రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ శేషుకుమార్, శ్రీశైలం ఐటిడిఎ ఇఇ జగ్గా జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.