శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (09:50 IST)

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం... ఏపీలో మరో వారం రోజులు వర్షాలు

rain
విదర్భ పరిసర ప్రాంతాల నుంచి కర్నాటక మీదుగా దక్షిణ కర్నాటక వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించివుంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నేడు కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
నిజానికి గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నిన్నమొన్నటివరకు ఎండలతో అల్లాడిపోయిన జనానికి కాస్తంత ఊపశమనం లభించింది. అయితే, అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పైగా, ఈ వర్షాలు ఇప్పట్లో ఆగేలా కనిపించండం లేదు.
 
విదర్భ నుంచి కర్నాటక వరకు విస్తరించిన ద్రోణి తూర్పు దిశగా పయనించే క్రమంలో రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి ద్రోణి కోస్తాపైకి వస్తుందని, ఆ తర్వాత నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా వాతవరణం చల్లపడుతుందన్నారు. అయితే, ఈ నెల 30 నుంచి మే 4వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. అలాగే, ఈదురు గాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని తెలిపారు.