గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (15:33 IST)

జగత్ జనని చిట్స్ వ్యవహారం.. ఏపీ సీఐడీ పోలీసుల అదుపులో టీడీపీ నేతలు

apcid police
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)ను ఏపీ సీఐడీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రాజమండిలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి తండ్రీకుమారులను అదుపులోకి తీసుకుని వారిని స్థానిక సీఐడీ కార్యాలయానికి తరలించారు. 
 
ఆదిరెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న జగత్‌ జనని చిట్స్‌ వ్యవహారంలో వారిద్దరినీ సీఐడీ విచారిస్తున్నట్లు సమాచారం. ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకుని తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పార్టీ కార్యాలయం మాజీ మంత్రి జవహర్‌, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా నేతలు అక్కడికి చేరుకుని సీఐడీ చర్యలను తీవ్రంగా ఖండించారు.
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైకాపాలో చేరలేదనే అక్కసుతోనే ఆదిరెడ్డి కుటుంబంపై ఈ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. "ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అరెస్ట్ చేసే వేళ.. ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా. ఫిర్యాదులు లేని కేసుల్లో తెదేపాకు చెందిన బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం'' అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.