సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (13:00 IST)

వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎక్సైజ్ ఉద్యోగులు మండిపాటు.. అరెస్టు ఖాయమా?

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌పై సాగుతున్న విచారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలంగాణ అబ్కారీ శాఖకు చెందిన సర్వీస్, రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌పై సాగుతున్న విచారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలంగాణ అబ్కారీ శాఖకు చెందిన సర్వీస్, రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. 
 
ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, సిట్ అధికారులపై వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ చేపడుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం చట్టవిరుద్ధమన్నారు. 
 
రాంగోపాల్‌ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, సాయంత్రం ఆయనపై ఆబిడ్స్‌ పోలీసు స్టేషన్‌ లేదా ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు. సిట్‌ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్టు ఖాయమని, నో డౌట్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజులకు మద్దతుగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'సిట్ అధికారులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించేవిధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం' అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో వర్మ పోస్ట్ చేయగా, ఇది సంచలనం రేపుతోంది.