శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (10:42 IST)

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో జాప్యం వుండకూడదు : వైఎస్ జగన్

ఆర్బీకేల ద్వారా కల్లాల (ఫామ్‌గేట్‌) వద్దనే ధాన్యం సేకరణ చేయాలనీ, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీపై ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చూడాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంకా సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:
 
మిల్లర్ల ప్రమేయం వద్దు:
ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలి. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్‌ వద్దకు పంపించవద్దు. అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి.మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలి,  మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి 
 
రెండు శాఖలు ఓన్‌ చేసుకోవాలి:
ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్‌ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ రెండూ కలిసి పనిచేయాలి
 
వ్యవసాయ సలహా కమిటీలు:
వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్‌ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు.
 
రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి:
ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు.
 
రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ:
రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్‌ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవ«ధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్‌ స్కేల్స్‌ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ మిస్‌ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి, దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండి
 
కాగా, ఈ రబీ (2020–21) సీజన్‌లో 45.20 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇది గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువన్న వారు, ఈసారి ఉత్పత్తి 65.23 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, త్వరలో ఆ సేకరణ 70 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని చెప్పారు.
 
కల్లాల (ఫామ్‌గేట్‌) వద్దనే ధాన్యం సేకరించేలా ఆర్బీకేల స్థాయిలో అవసరమైన అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల అధికారులు వెల్లడించారు. పీపీసీల సిబ్బందిని ఆర్బీకేల వద్ద కౌంటర్‌ ఏర్పాటు చేసి కూర్చోబెడుతున్నామని, ధాన్యం అమ్మాలనుకున్న రైతులు అక్కడికి వచ్చి, తమ పేర్లు నమోదు చేసుకుంటే వారికి కూపన్‌ ఇచ్చి, ఏరోజు ధాన్యం సేకరించేది అన్న తేదీని చెబుతున్నామని, ఆ తర్వాత ఆరోజు పీపీసీ సిబ్బంది స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి, ధాన్యం సేకరిస్తున్నామని వారు వివరించారు.
 
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్, పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎ.సూర్యకుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌తో పాటు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు చెందిన పలువురు అధికారులు హాజరు.