ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (15:01 IST)

కరోనావైరస్ కోరలు పీకేసేందుకు సీఎం వైఎస్ జగన్ పక్కా వ్యూహం

రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ కోసం తొలి నుంచి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఆ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్‌ ఆస్పత్రుల (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు)లో మంచి వైద్యం, ఆక్సీజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం వంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి చూడడం, కోవిడ్‌ రోగులకు బెడ్లు కేటాయింపు, 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఆశిస్తున్న  సేవలు అందుతున్నాయా? లేదా? అన్నది పర్యవేక్షించడం కోసం, ఇంకా ఎక్కడా ఏ లోపం లేకుండా చూడడం కోసం కొత్తగా మూడంచెల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోవిడ్‌ పరిస్థితిని అధికారులతో సమీక్షించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
మూడంచెల వ్యవస్థ:
జిల్లా స్థాయి మొదలు, రాష్ట్ర స్థాయి వరకు పని చేసే మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా నిర్దేశిత రుసుము కంటే ఎక్కువ వసూలు చేయకుండా కట్టడి చేయనున్నారు. అలాగే వైద్య సేవలనూ నిరంతరం పర్యవేక్షించనున్నారు.
 
క్లస్టర్లు–ఇంఛార్జ్‌లు:
జిల్లాలో కోవిడ్‌ చికిత్స చేసే ఆస్పత్రులన్నింటినీ కలెక్టర్‌ క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులు ఉంటాయి. ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా జిల్లా కలెక్టర్‌ నియమిస్తారు. తరుచూ ఆ ఆస్పత్రులను సందర్శించే ఆ అధికారి, వాటిపై నిఘా వేస్తారు. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో కూడా నిర్దేశించిన ఫీజుల కన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా చూస్తారు. ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా వేగంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అదే విధంగా ఆ క్లస్టర్‌ పరిధిలో అనుమతి లేకుండా కోవిడ్‌ చికిత్స చేసే ఆస్పత్రులపైనా ఆ అధికారి కన్నేస్తారు. 
 
ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌:
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజలు వసూలు చేయకుండా నియంత్రించడం కోసం వాటిపై తనిఖీలు చేయడం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఒక ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేస్తారు. అందులో ఔషథ నియంత్రణ విభాగం అధికారితో పాటు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి ఒకరు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరొక అధికారి సభ్యులుగా ఉండారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వైద్య సేవలు అందించడంతో పాటు, ఎక్కడా ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేయకుండా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తరుచూ తనిఖీలు నిర్వహిస్తుంది. క్లస్టర్‌ ఇంఛార్జ్‌లు మరింత సమర్థంగా పని చేసేలా ఈ స్క్వాడ్‌ సహాయ సహకారాలు అందిస్తుంది. వెంటనే ఆస్పత్రుల క్లస్టర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో నిర్దేశించింది.
 
రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ:
జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్‌ అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. 
ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఔషథ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ సభ్యులుగా ఉన్నారు.
 
ఒక జేసీకి కోవిడ్‌ బాధ్యతలు:
జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి)కు కోవిడ్‌-19కు సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆ జేసీ ఇప్పుడు చూస్తున్న బాధ్యతలను ఇతర జేసీలకు అప్పగించాలని ఆదేశించిన ప్రభుత్వం, కోవిడ్‌-19 బాధ్యతలు అప్పగించిన జేసీ విధులను కూడా నిర్దేశిస్తూ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది
 
కోవిడ్‌-19 జేసీ విధులు:
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రుల (కోవిడ్‌ ఆస్పత్రుల)లో శానిటేషన్, మంచి ఆహారం సరఫరా, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటు, వారి సేవలు. హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు, అందులో ఆరోగ్యమిత్రల విధులు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఆరోగ్యమిత్రల పనితీరుపై నిఘా. కాల్‌సెంటర్‌తో అనుసంధానం చేసుకుని, ఎప్పటికప్పుడు అన్నీ సక్రమంగా జరిగేలా చూడడం.

రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేయడం. ఇంకా 104 కాల్‌ సెంటర్‌ (జిల్లా కంట్రోల్‌ రూమ్‌)కు సంబంధించిన పూర్తి బాధ్యత. ప్రతి కాల్‌కు జవాబుదారి. కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేసేలా చూడడం. వీటన్నింటితో పాటు, డేటా అప్‌డేషన్‌తో సహా, ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌ బాధ్యతను కూడా జేసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ఇప్పటి వరకు ఏమేం చేశారు..:
ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమేం చేసిందన్నది ఒక్కసారి చూస్తే.. కోవిడ్‌ ఆస్పత్రుల (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు)లో మెరుగైన వైద్యసదుపాయాల కల్పనతో పాటు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, హోం క్వారంటైన్, హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కూడా ప్రభుత్వం వైద్య సదుపాయం కల్పిస్తోంది. అవసరమైన వారందరికీ కోవిడ్‌ కిట్‌లు కూడా అందజేస్తోంది.

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్ట్‌ చేయడంతో పాటు, పరీక్ష చేయించుకుంటామని స్వచ్ఛందంగా వచ్చిన వారందరికీ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ టెస్టు చేయించుకున్న 24 గంటలలోపే రిజల్ట్‌ అందించడంతో పాటు, టెస్టుల సంఖ్య కూడా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
ఆస్పత్రులు ప్రమాణాలు:
విరివిగా పరీక్షలు (ఫోకస్డ్‌ టెస్టింగ్‌) చేయడం, కోవిడ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం, కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ టీవీలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుతో పాటు, ఆయా ఆస్పత్రుల్లో శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందులు, ఆక్సీజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. 
 
ఇంకా..
-అదనంగా ఆక్సీజన్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుతో పాటు కోవిడ్‌ ఆసుపత్రుల్లో క్షణం కూడా కరెంట్‌ పోకుండా తగిన ఏర్పాట్లు.
-సీటీ స్కాన్, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ధరలకు కళ్ళెం,
-సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి వసూలు చేయరాదని, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు రూ.499 కి మించి వసూలు చేయరాదని ఆదేశాలు.
-అంతకు మించి వసూలు చేస్తే, ఆ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని హెచ్చరిక.
-కోవిడ్‌ నియంత్రణకు మరింత మంది వైద్యుల నియామకం.
-1,170 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పాటు, మరో 1,170 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు. 2 వేల మంది స్టాఫ్‌నర్సులు. 306 మంది అనస్ధీషియా టెక్నీషియన్లు. 330 మంది ఎఫ్‌ఎన్‌వోలు. 300 మంది ఎంఎన్‌వోలు. 300 మంది స్వీపర్ల నియామకానికి నోటిఫికేషన్‌.