సజ్జల సకల శాఖల మంత్రా? సూపర్ హోం మంత్రి...
సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్ని శాఖల్లోనూ చొరబడుతున్నారని వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఇప్పటికే సూపర్ హోంమంత్రిగా ఉన్న ఆయన, విద్యుత్ తదితర శాఖలన్నీ చూస్తున్నారన్నారు. చివరికి ప్రభుత్వోద్యోగులు సైతం సీఎం తరఫున సజ్జలతోనే సమావేశమయ్యారన్నారు. సాధారణ పరిపాలన పరిధిలోకి వచ్చే అంశాలనూ ఆయనే చూస్తుండటం బాధాకరమని, సకల శాఖల మంత్రిగా సకల విషయాలూ ఆయనే చూస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సమకూరుతున్న ఆదాయ, వ్యయాలను గణిస్తే రూ.91వేల కోట్లకు లెక్కలు తేలడంలేదన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఆదాయం, అప్పులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలతో అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.2,94,000 కోట్లు, చేసినఖర్చు రూ.4,50,000 కోట్లు కాగా. తెచ్చిన అప్పులు రూ.2,87,000 కోట్లన్నారు. లెక్కల్లో తేలని నిధులు రూ.1,31,000 కోట్లని, అయితే కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ.40వేల కోట్లు అప్పు చేశారని, దాన్ని మినహాయిస్తే అసలు లెక్కతేలని సుమారు రూ.91వేల కోట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అమ్మఒడి పథకం ఘోరంగా విఫలమవుతోందని, నవరత్నాల్లో ప్రధానమైన ఈ పథకంలో ఇప్పుడు ఒక సంవత్సరం రాలిపోతోందని రఘురామరాజు విమర్శించారు. జనవరిలో ఇవ్వాల్సిన నిధులను పిల్లల హాజరును చూసుకుని వచ్చే జూన్‌లో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు ప్రభుత్వ పరిపాలనా రాహిత్యమే కారణమని రఘురామ ధ్వజమెత్తారు. ఏప్రిల్ 1 నాటికి తమవద్ద 100మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అవసరమైనవారు ఇండెంట్ పెట్టుకుని తీసుకోవచ్చని రాష్ర్టాలకు కోల్ ఇండియా లేఖలు రాసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కోల్‌ఇండియాకు ఏపీ సర్కారు దాదాపు 300కోట్లు బాకీ ఉందన్నారు. బాకీ చెల్లించి, బొగ్గు తెచ్చుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి సీఎం సతీసమేతంగా కాకుండా ఒక్కరే వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయన్నారు. దీన్ని గమనించిన అమ్మవారే ఉరుములు వర్షంతో దేవాలయాన్ని సంప్రోక్షణ చేసినట్లు పలువురు స్వాములు, సిద్ధాంతులు త మ సనాతన స్వదేశీ సేనకు తెలియజేసినట్లు వివరించారు.