1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:20 IST)

కర్నూలులో కలకలం : రోడ్డు పక్కనే కరోనా మృతుల ఖననం

కరోనా వైరస్ దెబ్బకు కర్నూలు పట్టణంలో అలజడి చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా ఇది పేరుగడించింది. దీంతో కర్నూలు పట్టణ ప్రాంత ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అలజడి చెలరేగింది. 
 
ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను రోడ్డు పక్కనే ఖననం చేశారు. ఈ ఖననం చేసిన తర్వాత చేతి గ్లౌజులు, పీపీఈ కిట్లను కూడా అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. వీటివల్ల ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. 
 
పట్టణంలోని ప్రజా నగర్, వెంకన్న బావి, దిన్నదేవరపాడు గ్రామాలకు చెందిన ప్రజలు అందించిన సమాచారం మేరకు.. కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు శ్మశానవాటికల్లో కాకుండా, జాతీయ రహదారుల పక్కన పూడ్చిపెడుతున్నారని చెప్పారు. 
 
పైగా వారు ధరించిన పీపీఈ కిట్స్, చేతి గ్లౌజులు కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. వాస్తవానికి వీటిని కాల్చివేయాల్సివుంది. అధికారుల నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ఈ వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.