1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:04 IST)

మా ఇంట్లో ఆరుగురికి 'కరోనా' సోకింది : కర్నూలు వైకాపా ఎంపీ

కర్నూలు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులను కరోనా వైరస్ కాటేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సభ్యులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీగారే స్వయంగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ముంది. ముఖ్యంగా, కర్నూలు కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఇంటికి ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా ఆరుగురికి సోకింది. 
 
ఇందులో ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వీరి భార్యలు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు ఎంపీ వెల్లడించారు. అయితే, తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 
 
కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు.