శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (16:18 IST)

ఉపాధి లేక కూరగాయలు విక్రయిస్తున్న మెజీషియన్.. ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్టపడలేదు. ఈ లాక్‌డౌన్ కారణంగా సర్వంమూతబడ్డాయి. ఫలితంగా కోట్ల మంది ప్రజలు ఉపాధిని కోల్పోయి, అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిలో ప్రముఖ మెజీషియన్ కూడా ఉన్నారు. 
 
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఈయన ఇపుడు కూరగాయలు విక్రయిస్తున్నాడు. ఈ మెజీషియన్ పేరు రాజు మహోర్. రాజస్థాన్ రాష్ట్రంలో మంచి పేరున్న ఇంద్రజాలికుడు. 38 ఏళ్ల రాజు మహోర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్జే సామ్రాట్ జాదూగర్ అనే పేరుతో ఎంతో ప్రసిద్ధుడు. 15 ఏళ్లుగా ఇంద్రజాలం ప్రోగ్రాములు ఇస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
 
గతంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో మ్యాజిక్ షోలు నిర్వహించాడు. రోజుకు 10 వరకు షోలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సామ్రాట్ జాదూగర్ పని లేకుండా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అతని వద్ద పనిచేసే 12 మంది సిబ్బందికి కూడా ఉపాధి పోయింది. ఇక పూటగడవడం కష్టమని భావించిన ఆయన... ధోల్‌పూర్ జిల్లాలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఇంటి అద్దె కట్టాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా డబ్బు తప్పనిసరి అని, కూరగాయలు అమ్ముకోవడం తప్ప తనకు మరో ఆలోచన రాలేదని సామ్రాట్ జాదూగర్ తెలిపాడు. ఈ లాక్‌డౌన్ కారణంగా ఇలా రోడ్డునపడిన సెలెబ్రిటీలు ఎంతో మందివున్నారు.