శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:07 IST)

పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌లు .. ఒక్క ముంబైలోనే 20 శాతం కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1990 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 26496కు చేరింది. ఇందులో దాదాపు 20 శాతం కేసులో ఒక్క ముంబై మహానగరంలోనే నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 824కు చేరగా, గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇకపోతే, ఈ వైరస్ బారినపడినవారిలో ఇప్పటివరకు 5,804 మంది కోలుకోగా, వివిధ ఆసుపత్రుల్లో 19,868 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 7,628కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 323 మంది మృతి చెందారు.
 
గుజరాత్‌లో 3,071 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,625కి చేరింది. తమిళనాడులో 1,821, రాజస్థాన్‌లో 2,083, మధ్యప్రదేశ్‌లో 2,096 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 1,793 మందికి కరోనా సోకింది. కేరళలో 457 మందికి కరోనా సోకింది. కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
మరోవైపు, దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబై మహానగరంలోనే 20 శాతం కేసులు నమోదయ్యాయి. అంటే 5 వేలకు పైగా కేసులు ఒక్క ముంబైలోనే నమోదుకావడం గమనార్హం. ఇది కేంద్ర రాష్ట్ర అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
శనివారం నాడు మహారాష్ట్రలో కొత్తగా 811 కేసులు నమోదుకావడంతో, రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. కొత్త కేసుల్లో 602 ముంబైలోనివే కావడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 21 కేసులు వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 323 కాగా, ముంబైలో 191 మంది మరణించారు.