సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (15:07 IST)

లాక్‌డౌన్ ఎఫెక్టు : 4 రాష్ట్రాల ఖజనా ఖాళీ - వేతనాలు కూడా చెల్లించలేని...

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లో ఉండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ నుంచి పాక్షిక సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపు ఏ విధంగానూ ఉపయోగపడేలా లేదు. పైగా, ఈ లాక్‌డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఇది రాష్ట్రాలకు పెద్ద సంకటంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రాలకు రావాల్సిన సొంత ఆదాయం కూడా చిల్లిగవ్వరావడం లేదు. దీంతో తెలంగాణ వంటి ధనిక రాష్ట్రాలే నిధుల లేమితో తల్లడిల్లిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో కోత విధించాయి కూడా. 
 
ఈపరిస్థితుల్లో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగినపక్షంలో పలు రాష్ట్రాల ఖజానా దివాళా తీసే ఆస్కారం ఉంది. ముఖ్యంగా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
లాక్‌డౌన్‌తో రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దేశంలోని పలు రాష్ట్రాలు రుణాల ద్వారా ఆదాయాన్ని సేకరించుకునేందుకు డబ్ల్యూఎంఏ లిమిట్‌ను ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 60 వరకు పెంచింది. 
 
అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఆదాయ వనరులు స్తంభించిపోనున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అధ్యయనంలో తేలింది. రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ఈ పరిస్థితులు తిరిగి చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని చెప్పింది.