మొబైల్ ఫోన్లపై కరోనా ప్రభావం... మే నెలాఖరుకు 4 కోట్ల ఫోన్లు మాయం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మొబైల్ ఫోన్లను కూడా వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా మే నెలాఖరు నాటికి ఏకంగా నాలుగు కోట్ల ఫోను మాయం కానున్నాయట. కరోనా వైరస్‌కు మొబైల్ ఫోన్లకు సంబంధం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి పాక్షికంగా లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. మొబైల్ ఫోన్ల విక్రయాలకు, రిపేర్ షాపులకు అనుమతులు లేవు.
అంతేకాకుండా, ప్రస్తుతం మే మూడో తేదీ వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ మే నెలాఖరు వరకు కొనసాగిన పక్షంలో 4 కోట్ల మొబైల్ ఫోన్లు చెడిపోయే ఆస్కారం ఉందట.
మొబైల్ ఫోన్ల హ్యాండ్ సెట్లలలో వచ్చే లోపాలు, బ్రేక్ డౌన్‌లు వంటి కారణంగా అవి ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ పేర్కొంది.
మొబైల్ ఫోన్ల విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షల కారణంగా ఇప్పటికే దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని అంచనా వేసింది.
అలాగే, హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల మరికొన్ని మొబైల్స్ నిరుపయోగంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 130 కోట్ల దేశ జనాభాలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, నెలకు 2.5 కోట్ల ఫోన్ అమ్మకాలు జరుగుతున్నట్లు వివరించింది.