రంజాన్ వేళ - పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ పొడగింపు
ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ పవిత్రమాసం ప్రారంభమైన తరుణంలో పాకిస్థాన్ దేశంలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు పొడగించారు. అంటే.. మే 9వ తేదీ వరకు ఇది అమల్లోవుండనుంది.
కాగా, కరోనా బాధిత దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇక్కడ సుమారుగా 12 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సుమారు 250 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంజాన్ నెల మధ్య వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్లు మంత్రి అసద్ తెలిపారు.
వైరస్ పోరాటంలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లాక్‌డన్ పొడగించాల్సి వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు అంటే మే 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రణాళిక, అభివృద్ధిశాఖ మంత్రి అసద్ ఒమర్ తెలిపారు.
మరోవైపు, మసీదుల్లో భారీ సంఖ్యలో జనం కూడటంపై మరో మంత్రి పీర్ నూర్ అల్ హక్ తీవ్రంగా మండిపడ్డారు. మసీదుల్లో మతపెద్దలు సామాజిక దూరాన్ని పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఒకవేళ కరోనా కట్టడిలో విఫలమైతే, మతసంస్థలే నింద మోయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నెల ప్రారంభాన్ని ప్రకటించకముందే.. పెషావర్‌లోని ముఫ్తీ ఖాసిమ్ అలీ ఖాన్ మసీదులో ప్రార్థనలు మొదలుకావడం పట్ల కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.