దేశంలో 24,506కు చేరిన మృతుల సంఖ్య.. వానాకాలంలో మళ్లీ కరోనా పంజా?
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇక భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్ కేసులు ఉండగా, 5192 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 6817కు కరోనా కేసులు నమోదవగా, 301 మంది మరణించారు. గుజరాత్‌లో 2,815 మంది ఈ వైరస్ బారిన పడగా, 127 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో 2514 కేసులు నమోదవగా, 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే.. ఓవైపు లాక్ డౌన్, మరోవైపు మండు టెండలు.. వీటి కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం రోజువారిగా నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అవి తగ్గే అవకాశం ఉంది.
అయినా రిలాక్స్ అయ్యేందుకు అవకాశం లేదు. ముందు ముందు మరింత ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. భారత్‌లో రెండోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. వానాకాలంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేశాక జూలై చివర్లో లేదా ఆగస్టులో వైరస్ మళ్లీ పడగ విప్పే అవకాశం వుందని వారు చెప్తున్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కొన్నివారాల వరకు పరిస్థితి అదుపులోనే ఉంటుందని.. జూలై చివర్లో లేదా ఆగస్టులో వైరస్ మళ్లీ పడగ విప్పే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలు, వాతావరణం చల్లబడటం దీనికి కలిసివస్తుందన్నారు.