బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:16 IST)

41 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాలు

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలానాల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. నకిలీ చలానాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.9.26 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.5.08 కోట్లు రికవర్‌ చేశామని, మరో రూ.4.18 కోట్లు రాబట్టాల్సి ఉందన్నారు. దర్యాప్తులో భాగంగా 11 జిల్లాల్లో 41 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాలను గుర్తించినట్లు చెప్పారు. 
 
ప్రాథమిక సమాచారం మేరకు కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులపై 44 కేసులు, 29 మందిపై శాఖాపరమైన చర్యలు, 9 మందిని సబ్‌రిజిస్ట్రార్‌ విధుల నుంచి తప్పించినట్లు చెప్పారు. నకిలీ చలానాల బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ పూర్తైన వెంటనే తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 
 
నకిలీ చలానాల వ్యవహారంలో విచారణకు అడిషనల్ ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి అదే ఏడాది జూలై 31 వరకు జరిగిన లావాదేవీలపై విచారణ జరిపారు. 2020 ఏప్రిల్ 1 నుంచి మార్చి 2021 వరకు జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.