సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (06:51 IST)

ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి: రాఘవులు

దేశంలో ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీ పాలనని దేశం మొత్తం వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎంబీ విజ్ఞాన కేంద్రలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీకి అవకాశం ఉన్నా ఏమీ చేయలేకపోతోందని చెప్పారు. దేశంలో ప్రజలంతా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పాటిస్తోందని తెలిపారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
 
మోదీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పారు. మరోవైపు పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. కరోనా విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కరోనా రావడంతో మోదీ ప్రభుత్వానికి సంతోషంగా ఉందన్నారు. ధరలు పెంచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతు సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్‌‌ను జయప్రదం చేయాలని రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అన్ని రకాల ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.