వర్షం కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?
వర్షపు చినుకుపడకుంటే వరుణ దేవుడి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు చేస్తుంటారు. ఈ పూజలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇపుడు వర్షం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాలికలను నగ్నంగా ఊరేగించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగించారు. వారి వెనుక గ్రామానికి చెందిన మహిళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడిచారు.
ఈ ఘటన రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని బనియా అనే గ్రామంలో ఆదివారం జరిగింది. దీని వెనుక ఆ బాలికల తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని కొందరు గ్రామస్థులు అంటున్నారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో వర్షాలు లేక కరువు ముసురుకుంటున్న వేళ గ్రామస్తులు మూఢనమ్మకాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.
ఐదేండ్లలోపు బాలికలు ఆరుగురు ఒకరి పక్కన ఒకరు దుస్తులు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి బయటకువచ్చింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. అలాగే, ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు, స్థానిక అధికారులు విచారణ చేపట్టారు.