కొట్టుకొచ్చిన కోళ్లు... ఎగబడిన జనం
భారీ వర్షాలు కురిస్తే వాగులు, వంకలు, చెరువులు పొంగిపోర్లుతాయి. అందులో చేపలు ఉంటే.. అవి వరద నీటితో పాటుగా రోడ్లపైకి చేరడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం వరద నీటిలో కోళ్లు దర్శనమిచ్చాయి. దీంతో జనాలు కోళ్లను పట్టుకుపోయేందుకు ఎగబడ్డారు.
ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జక్రాన్పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు పారుతోంది. వరద ఉధృతికి పక్కనే ఉన్న పౌల్ట్రీఫామ్ మునిగిపోగా, అందులోని కోళ్లు వరదలో కొట్టుకు పోయాయి. దీంతో కోళ్లు వరద నీటిలో చేరిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాటిని పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు వరద ఉధృతికి కోళ్లు కొట్టుకుపోవడంతో.. పౌల్ట్రీఫామ్ యజమానికి భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిరిసిల్ల జలదిగ్భంధంలో చిక్కుకుంది.
మరోవైపు వర్షాల కారణంగా వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో. కొన్ని మార్గాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఇక, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.