పులిచింతల ప్రాజెక్టులో కొట్టుకుపోయిన గేటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్ట్ కు మాయని మచ్చ ఏర్పడింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే, మొన్న వచ్చిన వరదలకు కృష్ణ జిల్లా పులిచింతల ప్రాజెక్టులోని 16 నెంబరు గేటు కొట్టుకొని పోయింది.
తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఇన్ ప్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్‌లో మెకానికల్ తేడా వలన 16 నంబర్ గేటు ఊడి పోయిందని సమాచారం. ఈ మధ్యాహ్నానికల్లా గేటును రిపేరు చేసేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. పులిచింతల ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్మిస్తోంది.
అయితే, ఇలాంటి సంఘటనలు నిర్మాణ నాణ్యతను అనుమానించేలా ఉన్నాయని, దీనికి సత్వరం పరిష్కార మార్గం కనుగొనాలని అధికారులు భావిస్తున్నారు. పులిచింతల గేటు ఊడిపోవడంపై నీటిపారుదల శాఖ అధికారులెవరూ మాట్లాడటం లేదు. దీనిపై వివరణ ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతి లభించాలని అధికారుల్లో ఒకరు అన్యాపదేశంగా మీడియాకు చెప్పారు. ఏది అన్నా తమ ఉద్యోగాల మీదకు వస్తోందని పేర్కొంటున్నారు.