కఢక్‌నాథ్ కోళ్లు కావాలంటున్న ధోనీ.. ఎందుకంటే?
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్‌ను తీసుకున్నాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కనిపించనున్నాడు. 2021 ఐపీఎల్ మహేంద్ర సింగ్ ధోని చివరి ఐపీఎల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ధోని క్రికెట్‌కు దూరమైన సమయంలో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. రైతుగా మారిపోయి.. అన్ని పనులు చేశాడు. తాజాగా ధోనికి కఢక్‌నాథ్ కోళ్లు కావాలట.
మిగతా కోళ్లతో పోలిస్తే.. అత్యధిక పోషక విలువలున్న మధ్యప్రదేశ్‌లోని భీలాంచల్ ప్రాంతానికి చెందిన కఢక్‌నాథ్ కోళ్లను రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో మహీ పెంచాలని అనుకుంటూ ఉన్నాడు. భోపాల్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబువా జిల్లాలోని పౌల్ట్రీ రైతు వినోద్ మేధ నుంచి 2వేల కోడి పిల్లల కోసం మహీ మేనేజర్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
డిసెంబర్ 15 సమయానికి కోడి పిల్లలను ధోని ఫామ్‌హౌజ్‌కు పంపాలని ఆ రైతు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మూడు నెలల క్రితం ఎంఎస్ ధోనీ వ్యవసాయ నిర్వాహకులు కృషి వికాస్ కేంద్ర మరియు కఢక్‌నాథ్ మొబైల్ ఫోన్ యాప్ ద్వారా తనతో టచ్ లోకి వచ్చారని పౌల్ట్రీ రైతు వినోద్ మేధ తెలిపారు. కఢక్‌నాథ్ కోళ్లకు సంబందించిన అన్ని విషయాలు వారితో చర్చించానని అన్నారు.
ఐదు రోజుల క్రితం ఎంఎస్ ధోనీ ఫామ్‌హౌస్ మేనేజర్ కాల్ చేసి 2000 కోడిపిల్లల కోసం ఆర్డర్ ఇచ్చారని వినోద్ వివరించారు. ఇప్పటికే డబ్బులు కూడా పంపించేశారని అన్నారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరైన ధోనీ ఫామ్‌హౌస్‌కు కఢక్‌నాథ్ కోడి పిల్లలను సరఫరా చేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.