శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (17:07 IST)

సీఎస్కే చరిత్రలో తొలిసారి... ఈ ఘోర ఓటమికి కారణం ఏంటి?

ఐపీఎల్ ఫ్రాంచైజీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఐపీఎల్ మొత్తం 13 సీజన్లలో (ఈ సీజన్‌తో కలుపుకుని) ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండుసార్లు మాత్రమే సీఎస్కే జట్టు ఐపీఎల్‌కు దూరమైంది. అంతేనా, మూడుసార్లు టైటిల్ విజేత. ఓసారి రన్నరప్. ఇలా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... ఈ 13వ ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఆ జట్టు ఆటతీరు కొనసాగింది. 
 
ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫలితంగా సెమీ ఫైనల్స్ కాదు కదా.. కనీసం ప్లేఆఫ్స్‌ను చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో ఫైనల్స్ చివరి బంతి వరకూ వెళ్లింది. ఈ ఏడాది మాత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. 
 
ఇంతటి ఘోర ఓటమిగల కారణాలను విశ్లేషిస్తే... కరోనా వైరస్ కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. మరికొందరికి సరైన ప్రాక్టీస్ లభించలేదు. ప్రధాన బౌలర్ హర్భజన్ సింగ్, కీలక బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వంటి మెరికల్లాంటి ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. 
 
అంతేకాదు, కీలకమైన మ్యాచ్‌లలో కెప్టెన్ ధోనీ కూడా సామర్థ్యానికి తగినట్టుగా ఆడలేదు. ఇమ్రాన్ తాహిర్ లాంటి మంచి బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడం, బ్రావో గాయపడడం జట్టు వైఫల్యానికి ముఖ్య కారణాలు. 
 
ఈ పేలవ ప్రదర్శన చివరకు సారథి ధోనీ సతీమణి సాక్షికి కూడా ఏమాత్రం నచ్చలేదు. సీఎస్కే ఓటమిపై ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశారు. ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమేనని... కొన్ని మ్యాచ్‌లలో గెలుస్తారని, కొన్నింటిలో ఓడిపోతారని సాక్షి తెలిపారు. 
 
గెలిచినప్పుడు సంతోషించడం, ఓడినప్పుడు వేదనకు గురవడం జరుగుతుంటుందని అన్నారు. అయితే క్రికెట్‌ను కేవలం ఆట మాదిరిగానే చూడాలని... మన భావోద్వేగాలను క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు వాడకూడదని చెప్పారు.
 
ఓడిపోవాలని ఎవరూ కోరుకోరని... ఇదేసమయంలో అందరూ విజేతలు కాలేరని అన్నారు. నిజమైన యోధులు యుద్ధం చేయడానికే పుడతారని సాక్షి చెప్పారు. అభిమానుల గుండెల్లో వారు ఎప్పటికీ సూపర్ కింగ్స్‌గానే ఉంటారని అన్నారు. 
 
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని చెన్నై ఓడించినప్పటికీ... ఆ గెలుపుని అభిమానులు ఆస్వాదించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. ధోనీ పని అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.