Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి
Bhairavi Ardya Deka pays tribute to singer Zubeen Garg
సింగపూర్‌లో సెప్టెంబర్ 19న స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ స్మారక సంతాప సభ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. స్కూబా డైవింగ్ చేస్తూ జుబీన్ గార్గ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన భారతీయ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
తెలుగులో కూడా ఆయన గుర్తుండిపోయే పాటలు పాడారు. హీరో నితిన్ నటించిన టక్కరి లోని యేలే యేలే, విక్టరీ సినిమాలోని ఓ బ్యాచిలర్, రామ్ పోతినేని మస్కా మూవీలోని గుండె గోదారిలా వంటి పాటలను పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ పాటలను పాడే అవకాశం దివంగత సంగీత దర్శకుడు చక్రి ఇచ్చారు.
తెలుగుతో పాటు 40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అరుదైన ప్రతిభావంతుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం పట్ల హీరోయిన్ భైరవి అర్ద్య డేకా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. ఇది సినీ అభిమానులకు తీరని లోటు. జుబీన్ మన కాలంలోని అత్యుత్తమ గాయకుల్లో ఒకరు. ఆయన కేవలం కళాకారుడే కాదు, పేదలకు చేయూతనిచ్చిన మహానుభావుడు కూడా. అస్సాంలో ప్రజలు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు అని తెలిపారు.
జుబీన్ గార్గ్ అసమానమైన సహకారాన్ని గుర్తిస్తూ, ఆయన వారసత్వాన్ని రాబోయే తరాలకు సజీవంగా ఉంచేందుకు ప్రత్యేక స్మారక ట్రస్ట్ స్థాపనకు భూమిని కేటాయించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు భైరవి కృతజ్ఞతలు తెలిపారు.
సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, నటుడు వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చూపిన జుబీన్ గార్గ్ భారతీయ సినీ ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.