గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 29 మే 2021 (12:16 IST)

సాల్మొనెల్లా: కోళ్లను ముట్టుకోకండి, కొత్త ఇన్‌ఫెక్షన్ సోకుతోంది, ఇది పిల్లలకు ఎక్కువ ప్రమాదకరం- సీడీసీ హెచ్చరిక

బతికున్న కోళ్లు, బాతులను ముట్టుకోకండి.. వాటి నుంచి ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. కోళ్లు, బాతుల నుంచి సంక్రమించే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లు అమెరికాలో పెరుగుతున్నాయి. 43 రాష్ట్రాల్లో 163 సాల్మొనెల్లా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజారోగ్య అధికారులు, సీడీసీ దీనిపై దృష్టి సారించింది. ఇంటి వెనుక పౌల్ట్రీలు ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకినట్లు వారి పరిశీలనలో తేలింది.

 
‘‘బతికున్న కోళ్లు, బాతులను ముట్టుకోవద్దు. వాటి నుంచి బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు మీ శరీరంలోకి ప్రవేశించే ముప్పుంది’’అని సీడీసీ హెచ్చరించింది. కోళ్లు, బాతులు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, వాటి నుంచి బ్యాక్టీరియా వ్యాపించే ముప్పుందని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా అవి ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం మరింత ఎక్కువని తెలిపింది.

 
ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే ఏమవుతుంది?
ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే జ్వరం, డయేరియా, కడుపు నొప్పి, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి చికిత్సా అవసరం లేకుండానే రోగుల్లో కొందరు కోలుకోగలరు. కానీ ఇన్ఫెక్షన్ తీవ్రమైతే రోగులు మరణించే ప్రమాదం ఉంది. తాజాగా నమోదైన కేసుల్లో మూడోవంతు ఐదేళ్లలోపు వారికే ఇన్‌ఫెక్షన్ సోకిందని సీడీసీ తెలిపింది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఈ ఇన్ఫెక్షన్‌తో 34 మంది ఆసుపత్రుల్లో చేరారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదు.

 
ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఏం చేయాలి?
పౌల్ట్రీల్లో తప్పనిసరిగా తిరగాల్సి వస్తే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా పక్షుల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలని సూచించింది. సరిగా వండని మాంసం, గుడ్లు, బతికున్న పక్షుల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల ఏటా అమెరికాలో 13 లక్షల 50వేల మంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని, 420 మంది చనిపోతున్నారని సీడీసీ అంచనా వేసింది.