శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:39 IST)

ఈరోజు అర్థరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు తిరగవంతే...

ఏపీఆర్టీసీలో సమ్మె సైరన్ మ్రోగింది. గుర్తింపు కార్మిక సంఘం మరియు ఇతర కార్మిక సంఘాలు వివిధ సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి మంగళవారం అర్థరాత్రి తర్వాత సమ్మకు దిగనున్నాయి. ఈ మేరకు 15 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 రీజియన్లలో సమ్మె కోసం జేఏసీ నాయకులు సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుండి అన్ని డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టి కార్మికులను సంఘటితం చేసారు. 
 
అధికారంలో ఉన్న పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీల మద్దతు కోరారు. కొన్ని యూనియన్‌లు మంగళవారం నుండే సమ్మెలో పాల్గొంనేందుకు సిద్ధంగా ఉండగా, ఆర్టీసీలో అధిక సభ్యత్వం గల నేషనల్ మజ్దూర్‌ యూనియన్‌ గురువారం అర్థరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటుంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటే దాదాపు 70 శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతాయి. కేవలం 30 శాతం మాత్రమే అద్దె బస్సుల రూపంలో నడిచే అవకాశం ఉంది. 
 
ఆర్టీసీ అధికార యాజమాన్యం కార్మిక సంఘాలతో మంగళవారం నాడు మలిదశ చర్చలు జరిపే అవకాశం ఉంది. చర్చలు సఫలం కాకుంటే మాత్రం సమ్మె అనివార్యం అవుతుంది. సమ్మె ఎప్పుడు జరిగినా తిరుమల తిరుపతి బస్సులకు మినహాయింపుని కల్పిస్తున్న నాయకులు ఈ సారి మాత్రం అలా జరిగే అవకాశాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే జరిగినట్లయితే తిరుపతి తిరుమల మార్గంపై 50% ప్రభావం పడుతుంది.