మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:05 IST)

మన వాళ్లు సరిగా వ్యవహరించడం లేదేమో అన్నంతగా ఆలోచనలు: సజ్జల రామకృష్ణారెడ్డి

రానున్న ఎన్నికలలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించేందుకు యాదవులు ప్రధాన భూమిక పోషించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదవుల ఆత్మీయ సమావేశం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నాన్యంప‌ల్లి హ‌రీష్ యాద‌వ్ అధ్యక్షత వహించారు.
 
సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణాలకు ధీటుగా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్లు యాదవులని అన్నారు. వెనకబడిన కులాల్లోనే యాదవులు ముందున్నారని వారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా, ఆర్ధికంగా ముందుకు రావాలని కోరారు. రెండున్నరేళ్లలో జరగనున్న ఎన్నికలకు ఇప్పటినుంచే సిధ్దం కావాలని కోరారు.

రాష్ర్టంలోని 90 శాతం కుటుంబాలకు వైయస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఆసరా, ఫీజురీయంబర్స్ మెంట్ తదితర పథ‌కాల ద్వారా లబ్ది కలుగుతోందని అన్నారు. 151 మంది ఎంఎల్ఏలు, 28 మంది ఎంపీలు, స్దానిక సంస్ధలలో ఘనవిజయం మన పక్షాన ఉన్నాయి.

అయినప్పటికి కూడా ప్రత్యర్ధి పార్టీలు రాష్ర్టంలో ఏదో జరుగుతోంది.... పింఛన్ లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు... అప్పులు... అంటూ ప్రజలలో గందరగోళం, అయోమయం సృష్టించేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు... ఇది ఫెయిల్ అయిన ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలన్నారు.

చంద్రబాబు జిమ్మిక్కులు... మోసపు తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే చంద్రబాబునుంచి కిందస్ధాయి వరకు ఒకే విధమైన దుష్ప్రచారాన్ని మనపై మనకే అనుమానాలు కలిగించేవిధంగా దుర్మార్గంగా చేస్తారు. ఈరోజు ఒక పత్రికలో ప్రభుత్వం గురించి చెడుగా రాస్తారు. దానిపై ధర్నాలు, ఆందోళనలు చేస్తారు. అదే అంశంపై ఎవరో కోర్టులో వేస్తే దానిపై అక్కడ మొట్టికాయలు పడ్తాయి.

దానిపై వారి అనుకూల మీడియాలో డిబేట్లు.... ఇదంతా చూసిన తర్వాత మన కార్యకర్తల్లోనే ఏదో మన వాళ్లు సరిగా వ్యవహరించడం లేదేమో అన్నంతగా ఆలోచనలు కలుగుతుంటాయి. ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా చేస్తున్నదుష్ప్రచారం నిజం కాదు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయలు దిగువ, మధ్యతరగతి, పేద కుటుంబాలకు మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాలలో వేశారు.

ఇలా పేద వర్గాలను ఆదుకోవడం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. టిడిపి హయాంలో కూడా పథ‌కాలు జన్మభూమి క‌మిటీల‌ దోపిడీ తర్వాత ప్రజలకు చేరేవి. ఈ వాస్తవాలను బిసి కులాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలి. టిడిపి, ఇతర పక్షాలు చేస్తున్న దుర్మార్గ, దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.