శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (10:12 IST)

చంద్ర‌బాబు హ‌యాంలో ఇసుక దోపిడి : మంత్రి పెద్దిరెడ్డి

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరులోని ఇసుక క్వారీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గనులశాఖ‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేసేందుకు సిద్దంగా వున్న ఇసుక లారీల యజమానులతో మాట్లాడారు. ఈసందర్బంగా జిపిఎస్‌తో అనుసంధానం చేసుకోకుండా వున్న లారీలను ఇసుక రవాణాకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్ లలో సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రాష్ట్రంలో వందకు పైగా చెక్ పోస్ట్ లను సిద్దం చేశామని తెలిపారు.

ఆకస్మిక తనిఖీ అనంతరం విజయవాడలోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ యధేచ్చగా కొనసాగిందని విమర్శించారు. అయిదేళ్ల కాలంలో ఇసుక ద్వారా చంద్రబాబు ఐదు వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో మహిళా సంఘాలకు ఇసుక రీచ్ లు అంటూ తన అనుయాయులకే క్వారీలను దారాదత్తం చేశారని అన్నారు.

తరువాత ఉచిత ఇసుక అంటూ ఏకంగా బహిరంగ దోపిడీకే చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తాహసిల్థార్ పై ఏరకంగా దాడి చేశారో, జుట్టుపట్టుకుని క్వారీలో ఈడ్చుకుని వెళ్ళారో రాష్ట్ర ప్రజలు చూశారని గుర్తు చేశారు. తప్పు చేసిన శాసనసభ్యులను వెనకేసుకు వచ్చిన చంద్రబాబు, చివరికి బాధితురాలిని పిలిచి కౌన్సెలింగ్ చేయడం ద్వారా తన దోపిడీ విధానాలను సమర్థించుకున్నారని మండి పడ్డారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రక్షాళన చేయాలని చూస్తుంటే... ఎల్లో మీడియాతో ఈ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఇసుక కొరత అంటూ రాశారు... ఈ రోజు సమస్య పరిష్కారం అవ్వడంతో... ఇసుక అక్రమ రవాణా అంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాస్తోందని విమర్శించారు.

అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, ఎక్కడైనా తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే... వాటిని స్వీకరిస్తామని అన్నారు. కానీ రాజకీయ దురుద్దేశంతో అవాస్తవాలను వ్యాప్తి చేయాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. 
 
రాష్ట్రంలో 400 చెక్ పోస్ట్ ల ఏర్పాటు...
రాష్ట్రంలో ఇసుక రవాణాపై పూర్తిస్థాయి నియంత్రణ వుండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో నాలుగు వందల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వీటిల్లో ఇప్పటికే వంద చెక్ పోస్ట్‌లు సిద్దమయ్యాయని వెల్లడించారు. ప్రతి చెక్ పోస్ట్ లోనూ రెండు సిసి కెమేరాలు వుంటాయని తెలిపారు. ఇసుక రీచ్ ల వద్ద కూడా జిపిఎస్ వున్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నామని అన్నారు. అధిక ధరలకు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా రెండేళ్ల జైలు, రెండు లక్షల జరిమానా విధించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రోజువారీ ఇసుక తవ్వకం దాదాపు నాలుగు లక్షల టన్నులకు చేరిందని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఇది అయిదు లక్షల టన్నులకు చేరుకుంటుందని అన్నారు.

రాష్ట్రంలో మైనింగ్ అధికారుల లెక్కల ప్రకారం ఇసుక నిల్వలు సుమారు పది కోట్ల టన్నులు వుందని, ఇది రాబోయే అయిదేళ్ల తరువాత కూడా సరిపోతుందని అన్నారు. వచ్చే వర్షాకాలంలో కూడా వరదలు వచ్చినా ఇసుకకు ఇబ్బంది లేకుండా ఇసుకను డిపోలు, స్టాక్ పాయింట్ లలో నిల్వ వుంచుతున్నామని తెలిపారు. రోజువారీ సగటు వినియోగం 65వేల టన్నులు కాగా, మిగిలిన ఇసుక స్టాక్ పాయింట్ లలో విక్రయాలకు సిద్దంగా వుంచుతున్నామని వెల్లడించారు. 
 
రాష్ట్రంలో 130 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు...
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 130 ఇసుక రీచ్‌లు పనిచేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిలో  102 ఓపెన్ రీచ్‌లున్నాయని అన్నారు. అలాగే 53 డీసిల్టేషన్‌ రీచ్ లు గుర్తిస్తే, వాటిల్లో 43 పనిచేస్తున్నాయని, 23 డీ కాస్టింగ్ పాయింట్లలో కూడా ఇసుక వెలికితీస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 158 స్టాక్ యార్డ్ లు 50 ఇసుక డిపోలతో కలిపి మొత్తం 208 ఇసుక విక్రయ కేంద్రాలు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. టన్ను ఇసుకను 375 రూపాయలుగా రేటు ఖరారు చేశామని, అయితే నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రేటు కార్డును కూడా ప్రకటించడం జరిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందకు తీసుకువెడుతున్నారని, వీటిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి చంద్రబాబు ఇసుక దీక్ష చేసిన రోజు కూడా లక్ష టన్నులకు పైగా ఇసుకను వెలికితీశామని, సగట వినియోగం కంటే కూడా ఇది ఎక్కువేనని గుర్తు చేశారు.