గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (20:43 IST)

ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు

Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. 
 
పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
ప్రజలు వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు ప్రాజెక్టు స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని స్పష్టం చేశారు. 
 
కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 
 
ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక విశాఖలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.