గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:02 IST)

శెభాష్ సోదరా!.. పోలీసులకు కమిషనర్ ప్రశంస

దసరా ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉత్సవాల సందర్భంగా దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, తెప్పోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ అధికమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో పరస్పరం సహకారం అందించి విధులు నిర్వహించిన వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది మరియు అధికారులకు పోలీస్ కమీషనర్ అభినందనలు తెలియజేయడం జరిగింది.

కమాండ్ కంట్రోల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... 24 గంటల పాటు అప్రమత్తం, అంకిత భావం మరియు బాధ్యతగా విధులు నిర్వహించి, దసరా ఉత్సవాలు విజయవంతం అవడానికి కృషి చేశారని సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బంది మరియు అధికారులను అభినందించడం జరిగింది. బందోబస్తులో ఏ పాయింట్ లో విధులు నిర్వహించినా కూడా అమ్మవారి సన్నిధిలో సేవ చేసినట్లేనని పేర్కొంటూ ఇదొక అదృష్టమని తెలియజేశారు.

ఈ బందోబస్తులో పోలీసులది కీలకమైన పాత్రని, అటువంటి సమయంలో ఒక భాద్యతగా తీసుకుని క్రింది స్థాయి సిబ్బంది నుండి ఉన్నతాధికారుల వరకు నాయకత్వ లక్షణాలతో వారికి కేటాయించిన పాయింట్లలో బందోబస్తు విధులు నిర్వహించారని కొనియాడారు.

ఉత్సవాల సందర్భంగా ప్రాముఖ్యమైన రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో వీలైనంత మేరకు నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలకు అవాంతరాలు లేకుండా చక్కటి ట్రాఫిక్ మేనేజ్ మెంట్ చేయడం జరిగిందని, పార్కింగ్ యాప్ చక్కటి ఫలితాలు ఇచ్చాయన్నారు.

అలాగే ముఖ్యంగా వూహాత్మమైన బందోబస్తు చర్యల కారణంగా ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా నిరోధించగలిగామని, క్రైమ్ బృందాలు సమర్ధవంతంగా పని చేసి ముందుగానే నేరస్థులను పసిగట్టి పట్టుకోవడం జరిగిందన్నారు.

అలాగే దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భవానీ సేవాదళ్ సిబ్బంది చక్కగా విధులు నిర్వహించారని తద్వారా ప్రజల నుండి ప్రశంసలు వచ్చాయన్నారు. 

భవిష్యత్తులో బందోబస్తు మెరుగుపర్చడానికి పోలీస్ అధికారుల నుండి సూచనలు వ్రాతపూర్వకంగా తీసుకున్నారు. 
అనంతరం బందోబస్తు విధులు నిర్వహించిన పోలీస్ అధికారులకు అమ్మవారి చిత్రపటాన్ని మరియు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ జాయింట్ పోలీస్ కమీషనర్ డి.నాగేంద్రకుమార్ ఐపిఎస్, డి.సి.పి.లు ఎస్.హరికృష్ణ, డి. కోటేశ్వరరావు, వి.హర్షవర్ధనరాజు, సి. హెచ్.విజయరావు, ఏబిటిఎస్ ఉదయరాణి మరియు ఇతర
జిల్లాలు మరియు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.