బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (18:17 IST)

నాకేం తెలియదు.. ఆ ముగ్గురే కీలకం.. వైకాపా సోషల్ మీడియా గుట్టు బయటపెట్టిన వర్రా

varra ravindra reddy
వైకాపా సామాజిక విభాగం కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాను నిమిత్త మాత్రుడుని మాత్రమేనని, ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తేనే తాను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం పేర్కొన్నారు. ఇదే అంశాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించిన వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొన్నారు. 
 
ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లం. జగన్ కావాలి.. జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్ చేసేవాళ్లం. వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టాం. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతోనే పోస్టులు. సజ్జల భార్గవ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింతంగా రెచ్చిపోయాం అని చెప్పినట్టు సమాచారం. 
 
అలాగే, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవ రెడ్డి బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో భార్గవ రెడ్డి పోస్టులు పెట్టేవారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ విజయలక్ష్మిలపై అసభ్యకర పోస్టులు పెట్టాం. ఆ పోస్టులు పెట్టాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాశ్ రెడ్డి, రాఘవరెడ్డిలు చర్చించేవారు. పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టా. వైకాపా సోషల్ మీడియాలో సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమా రెడ్డి కీలకం అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, మొదట్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టామని, ఆ తర్వాత సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు అందుకున్నాక మరింతగా విజృంభించామని చెప్పాడు. వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానళ్లలో మాట్లాడే వాళ్లని తాము టార్గెట్ చేశామని... నేతలు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టామని వివరించాడు. గతేడాది సెప్టెంబరులో పవన్ కల్యాణ్, వారి పిల్లలపై పోస్టులు పెట్టినట్టు వర్రా అంగీకరించాడు. 
 
అయితే, పోస్టులు తొలగించాలని వెంకటాద్రి అనే వ్యక్తి వచ్చాడని, రూ.2 లక్షలు ఇస్తే ఆ పోస్టులు తొలగిస్తానని అతడిని డిమాండ్ చేసినట్టు తెలిపాడు. 2020 నుంచి ఐప్యాక్ టీమ్ ద్వారా కంటెంట్ వచ్చేదని, తాము ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేవాళ్లమని తెలిపాడు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లోనూ పోస్టు చేసేవాళ్లమని పేర్కొన్నాడు. కాగా, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టయిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా... న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే.