శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (07:18 IST)

మహిళలపై దారుణంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్య: పీతల సుజాత

326రోజులుగా శాంతియుతంగా,  న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి ప్రాంతరైతులు, మహిళలపై ప్రభుత్వం అక్రమకేసులు పెట్టి, బేడీలువేసి జైళ్లకు పంపడం, వారిని పరామర్శించడానికి వెళుతున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడం వైసీపీప్రభుత్వ అవలంభించిన హేయమైన చర్యని, టీడీపీ మహిళానేత, మాజీమంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మహిళలని కూడా చూడకుండా నిన్నటికి నిన్న ప్రభుత్వం వారిని ఘోరంగా హింసించిందని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి, దళితరైతులకు సంకెళ్లు వేసిందన్నారు.

వైసీపీకి ఓటేసినందుకు ప్రజలపై మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, దళితులపై ఈ ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందన్నారు. మహిళలు ఏం నేరం చేశారని పోలీసులువారిపై అమానుషంగా ప్రవర్తించారన్నారు. 5కోట్ల మంది ప్రజలకోసం తమ భూములను త్యాగం చేయడమే రైతులు, మహిళలు చేసిన నేరమా అని మాజీమంత్రి ప్రశ్నించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ -21 ను, సీఆర్ పీసీ సెక్షన్ – 41(ఏ)ని కూడా ఉల్లంఘించారన్నారు. గతంలో డీ.కే.బోస్ ఉదంతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా అపహాస్యం చేసేలా వైసీపీప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసిందని సుజాత మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నిరంకుశత్వంలో ఉన్నామా అనే భావన కలుగుతోందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి, మహిళలని కూడా చూడకుండా వారిపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఖాకీల క్రౌర్యానికి సంబంధించిన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని, చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తిచేశారు.

పోలీసుల అనేవారు ప్రభుత్వాలు మారినా వారివిధులు వారు నిర్వర్తించాలనే విషయం మర్చిపోయారని, వారికి అంతగా ప్రభుత్వానికి ఊడిగం చేయాలని ఉంటే, ఉద్యోగాలు వదిలేసి, వైసీపీలో పనిచేయవచ్చన్నారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తుంటే, ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం దిగజారిపోతే, పోలీసులు దిగజారడమేంటన్నారు.

అమరావతి విషయంలో మాటతప్పి, మడమతిప్పిన జగన్మోహన్ రెడ్డికి  కేంద్రంపై పోరాడి, పోలవరానికి నిధులు, ప్రత్యేకహోదా తీసుకొచ్చే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని సుజాత నిలదీశారు. 

దళితులు, మహిళలు, బలహీనవర్గాల వారిని హింసించడం, రైతులకు బేడీలు వేయడం వంటి ఘటనలు వైసీపీరాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాకే దళితులకు కొత్తగా శిరోముండనాల పరిచయం చేసిందని, అందుకు కారకులైనవారిపై ఇంతవరకు చర్యలు లేవన్నారు.

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయి త్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదని, మహిళ హోం మంత్రిగా ఉన్నా, ఆమెఏనాడూ  ఆడబిడ్డల పక్షాన నోరుతెరిచింది లేదన్నారు.  అటువంటి పదవిలో ఆమె ఎందుకుందో ఆమే చెప్పాలన్నారు.

గాజువాక ఘటనలో గానీ, లింగపాలెం మండలం తోచలక గ్రామంలో జరిగినఘటనలో గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైసీపీప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, దిశాచట్టాన్ని దిశలేని చట్టంగా మార్చిందన్నారు.

దిశాపోలీస్ స్టేషన్ పరిధిలో, ముఖ్యమంత్రి నివాసముండే, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనే మహిళలపై దారుణాలు జరిగితే చర్యలు లేవన్నారు. దిశచట్టం తమపరిధిలో లేదని కేంద్రం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుచర్యలు, కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించాలని చూస్తోందన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు పెట్టడంచూస్తేనే, ఈ ప్రభుత్వం ఎంతటి అవివేకంగా,  మూర్ఖంగా పనిచేస్తోందో అర్థమవుతోందన్నారు. ఎన్నికలకు ముందు అనేకహామీలిచ్చిన జగన్ వాటిని గాలికి వదిలేసి, అమరావతి ఉద్యమకారులపై పడ్డాడన్నారు.

జగన్ ప్రభుత్వతీరు, పోలీసుల చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నా రన్నారు. రైతులు, మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిదికాదని పాలకులు తెలుసుకోవాలన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వం మాటవిని రైతులకు సంకెళ్లువేయడం, మహిళలపై దారుణంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యగా సుజాత అభివర్ణించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైతులు, మహిళలపై పెట్టిన తప్పుడుకేసులు ఎత్తివేసి, వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి జరిగిన ఘటనకు బాధ్యతవహిస్తూ, మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.

రైతులకు సంఘీభావంగా జైల్లో ఉన్నవారిని పరామర్శించడానికి వెళ్లే టీడీపీనేతలను ఎక్కడివారినక్కడే ఎందుకు గృహనిర్భంధం చేశారన్నారు.