శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (08:50 IST)

బీజేపీ వైపు వైసీపీ మహిళా నేత చూపు

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ముఖ్యనేతలు టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. అయితే ఇక వైసీపీ వంతు వచ్చింది.

వైసీపీకి చెందిన మహిళా నేత తోట వాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించింది.
 
2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన తోట వాణి.. టీడీపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే కొన్ని రోజుల క్రితమే చినరాజప్ప ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని ఎస్పీతో పాటు కోర్టును వాణి ఆశ్రయించారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమోగానీ వైసీపీని వీడి బీజేపీలో చేరాలని వాణి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
సుజనా ద్వారా మంతనాలు..!
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం. వాణి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. వాణి ఏపీలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అనే విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి వాణి వైసీపీకి గుడ్ బై చెబుతారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంత వరకూ తోట వాణి స్పందించలేదు.