మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2020 (21:13 IST)

సామాజిక మాధ్యమ వేదికల ఆలంబనగా చేనేత వస్త్ర ప్రచారం, ముందడుగు వేస్తున్న “ఆప్కో”

రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవన ప్రమాణ స్దాయి పెంపే ధ్యేయంగా పనిచేస్తూ, కేవలం చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయిస్తున్న ఆప్కో ఇకపై సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో ముందడుగు వేయనుంది. సామాజిక మాధ్యమాలలో ఆప్కో వస్త్రాలను గురించి పెద్ద ఎత్తున్న ప్రచారం చేయటం ద్వారా ఈ వ్యవస్దను కాపాడుకోవలసిన ఆవశ్యకతను జనబాహుళ్యంలోకి తీసుకు వెళ్లనుంది.
 
రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధికులు అధారపడిన రంగం చేనేత కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రాకుల సహకార సంఘం (ఆప్కో) పేరిట ఈ సంస్ధ చేనేత సంఘాల నుండి వస్త్రాలను కోనుగోలు చేసి ఆప్కో ప్రదర్శన శాలల ద్వారా విక్రయిస్తుంది. అయితే ప్రస్తుతం ఇతర మాధ్యమాల కంటే సామాజిక మాధ్యమాలు ప్రచారం విషయంలో ముందుంటుండగా ఆ వేదికలను స్వదినియోగం చేసుకోవాలని నిర్ణయించారు.
 
అప్కో ఇప్పటికే అమెజాన్ వంటి అగ్రశ్రేణి ఆన్ లైన్ విక్రయ వ్యవస్ధల ద్వారా చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున ప్రపంచానికి పరిచయం చేస్తుండగా, దీనిని మరింత పెంపెందించే క్రమంలో సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోనున్నట్లు సంస్ధ నిర్వహణ సంచాలకులు డాక్టర్ బిఆర్ అంబేత్కర్ తెలిపారు. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్స్ యాప్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాలను ఉపయోగించుకోవటం ద్వారా ఆప్కో వస్ర్తాల బ్రాండింగ్‌ను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు.
 
ఈ క్రమంలో భాగంగా చేనేత వస్త్రాల వినియోగ అవశ్యకత, మన్నికలపై లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తారు. ఎప్పటి కప్పుడు మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తీసుకువస్తున్న వస్త్ర శ్రేణి గురించిన పూర్తి సమాచారం వెనువెంటనే వినియోగదారులకు చేరేలా ఈ ప్రచార ప్రణాళికను సిద్దం చేసారు. సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూట్, ఆప్కో అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచారు.
 
సామాజిక మాధ్యమాల ద్వారా సాగే ఈ ప్రచారంలో అందరినీ భాగస్వాములను చేస్తామని, చేనేత వ్యవస్ధతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రచార ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నదే తమ ధ్యేయమని ఈ సందర్భంగా అప్కో ఎండి డాక్టర్ బిఆర్ అంబేధ్కర్ తెలిపారు. ప్రత్యేకించి చేనేత వస్ర్తాల ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని వారి సహాకరం ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
 
ప్రాధమికంగా సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌ల కోసం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తాము ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసామని, ఆ ప్రచారం వైరల్‌గా మారటంలో ప్రతి ఒక్కరి తోడ్పాటును చేనేత సమాజం కోరుకుంటుందని వివరించారు. రానున్న రోజుల్లో అన్ని ఇ-కామర్స్ వేదిలలోనూ ఆప్కో వస్ర్తాలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయని, సామాజిక మాధ్యమ ప్రచారం ఫలితంగా చేనేత వస్త్రాల విక్రయాలలో గణనీయమైన మార్పును ఆశిస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు.