"తిరుమల కొండలయ్య మంచి తిండి మెండయ్య" అని కాళిదాసు మహాకవి హాస్యోక్తి చేసినట్టుగానే, మన కొండలయ్య గంగాళాలు, గంగాళాలు ప్రసాదాలు తింటాడు. వేడి,వేడిగా వంటయింటి అలమేలుమంగ వండి వడ్డిస్తే కమ్మగా విందులు ఆరగిస్తాడు శ్రీనివాసుడు.
స్వామి అలంకారప్రియుడు, పుష్పప్రియుడు మాత్రమే కాదు నివేద్యప్రియుడు కూడా..! తాను తిని తన భక్తుల ఆకలి కూడా తీర్చడానికే అన్ని రకాలు వండించుకుంటాడు అని తిరుమల వెళ్లి శ్రీవారి ప్రసాదం తినే అందరికీ అర్ధం అవుతుంది.
నిత్యమూ నైవేద్యాలు నిండుగా మూడుపూటలా గంటానాధాల మధ్య భాలభోగం,రాజభోగం,శయనభోగంగా ఆరగిస్తాడు.ఇటు రోజు ఉండే నైవేద్యాలతో పాటు అటు ఆర్జిత సేవలలో ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి.
స్వామివారి నైవేద్య ఘనత ఇప్పటిది కాదు పూర్వకాలం నుండే స్వామి నైవేద్యాలకు ఎందరో రాజులు, సామంతులు, మణులు మాన్యాలను ఆలయానికి సమర్పించిన వివరాలు ఆలయ గోడలపై శాసనంగా మనకు కనిపిస్తాయి.
"ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవయ్య","అమృత మధనునికి అదివో నైవేద్యము" ఇలా చాలా స్వామివారి నైవేద్యాలపై ఎన్నో కీర్తనలు స్వామికి సమర్పించాడు అన్నమాచార్యుడు.అంతేకాదు తాను 8ఏళ్ళ ప్రాయంలో స్వయంగా పద్మావతీ అమ్మవారు తెచ్చి ఇచ్చిన ప్రసాదాలు తిన్నవాడు కూడానూ..!
ఇక స్వామివారి నైవేద్య వివరాలకు వస్తే, సుప్రభాతంతో మేల్కొల్పిన స్వామికి మొదటగా అప్పుడే తీసిన వెన్న నురగలు తేలే ఆవుపాలను అర్చకులు నివేదన చేసి తాంబూలాన్ని సమర్పిస్తారు.
ఇక నిత్య కైంకర్యాలను పూర్తి చేసి అర్చన చేసి భాలబోగం(అల్పాహారం) నివేదన చేస్తారు, తర్వాత రెండో అర్చన తర్వాత రాజభోగం(మహా నివేదన),ఇక సాయంకాల అర్చన తర్వాత రాత్రి శయనభోగం నివేదన చేస్తారు.
నిత్యం స్వామికి తోమాల సేవలో దోసెలు, కొలువు సేవలో బెల్లం,నువ్వులు,శొంఠి కలిపిన పదార్ధాన్ని నివేధిస్తారు.కల్యాణోత్సవ సేవలో లడ్డు,వడలను నివేధిస్తారు.రాత్రి ఏకాంత సేవలో వెచ్చని పాలు,పళ్ళు,నేతిలో వేయించిన జీడిపప్పు,బాదంపప్పుని నివేధిస్తారు.
ఇక వారంలో ప్రతిరోజు నిత్యనైవేద్యాలతో పాటు వారపు ప్రత్యేక నైవేద్యాలు ఎం ఉంటాయో చూద్దాం.ప్రతి రోజు నైవేద్యంలో పొంగలి,ధద్యోజనం,కదంభం,మొలహోర, సిరా, సికరాబాత్,చక్కెర పొంగలి,మిరియాల పొంగలి,పెరుగన్నం ఉంటాయి. వీటికి తోడు ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనల్లో అనుగుణంగా ప్రత్యేక ప్రసాద సంఖ్య పెరుగుతుంది.వాటి వివరాలు చూద్దాం.
ఆదివారం - ఆదివారం పిండి
సోమవారం - 51 పెద్ద దోసెలు,51 చిన్న దోసెలు,51 పెద్ద అప్పాలు,102 చిన్న అప్పాలు.
మంగళవారం - మాత్రాన్నం
బుధవారం - పాయసం,పెసరపప్పు
గురువారం - జిలేబి,మురుకులు,పాయసం,పులిహోర రాశి
శుక్రవారం - పోలీలు
శనివారం - కదంభం,లడ్డు,దోస,వడ
ఇక బ్రహ్మోత్సవాలు,ప్రత్యేక వివిధ ఉత్సవాలలో ప్రసాదాల సంఖ్య పెరుగుతుంది. ప్రసాదాలన్ని శ్రీవారిముందు ఉన్న శయణమండపంలో ఉంచి గర్భాలయం తలుపులు వేసి అర్చకుడు విష్ణు,గాయత్రీ మంత్రాలను ఉచ్చరిస్తూ,ప్రసాదాలపై నెయ్యి, తులసి వేసి వాటిని తాకి స్వామివారి చేతిని తాకించి నోటికి తాకుతారు(గోరుముద్దలు తినిపించినట్టు),ముద్ద ముద్దకి మధ్య తులసి,వనమూలికలు కలిపిన తీర్థం తగిస్తారు. ఇలా స్వామివారు తిని మిగిల్చిన శేష భాగాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
స్వామికి నైవేద్యం పెట్టడం అంటే ఆయన కడుపులో ఉన్న సకలలోకాలకు ఆకలి తీర్చడం అన్నమాట.ఇంతటి ఘనత ఉన్న శ్రీవారి నైవేద్యాలు తినడం భక్తుల పూర్వజన్మ పుణ్యం.