శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (21:01 IST)

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు రాయితీలు: సిఎస్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వ పరంగా అందించే వివిధ రాయితీలను సకాలంలో అందించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

ఈ మేరకు పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై సమీక్షించారు.

ముఖ్యంగా ఎపి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ(AP IDP 2015-20) ప్రకారం మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు పెట్టుబడి సబ్సిడీ, నెట్ ఎస్జిఎస్టి రీయింబర్సు మెంట్, పవర్ కాస్ట్ రీఇంబర్సుమెంట్, ఇంటరెస్ట్ సబ్సిడీ, నూరు శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు, స్వచ్ఛాంధ్ర,ల్యాండ్ కన్వర్సన్, స్కిల్ అప్ గ్రేడేషన్ మరియు ట్రైనింగ్ కాస్ట్, మార్కెటింగ్ ఇన్సెంటివ్ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అందించే వివిధ రాయితీలను సత్వరం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

తద్వారా రాష్ట్రంలో సకాలంలో పరిశ్రమలు నెలకొల్పబడి రాష్ట్రం పారిశ్రామికంగా మెరుగైన రీతిలో నిలచేలా కృషి చేయడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించేలా అవకాశం ఉంటుందని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ గత ఐదేళ్ళ కాలంలో లక్షా 70వేల కోట్ల పెట్టుబడులతో 2లక్షల 4వేల 183 ఉద్యోగాలు కల్పించేందుకు 91 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు సంబంధించిన వివిధ జిఓలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 
 
అలాగే గత ఆరు మాసాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 14వేల 985 కోట్ల రూ.లు పెట్టుబడితో 16వేల 862 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ కంపెనీలు, పరిశ్రమలు ప్రారంభించ బడ్డాయని వివరించారు.అంతేగాక రానున్న ఆరు మాసాల్లో వివిధ జిల్లాల్లో 4వేల 210 కోట్ల రూ.లు పెట్టుబడులతో 9వేల 95మందికి ఉద్యోగాలు కల్పించబడే వివిధ కంపెనీలు వారి ఉత్పత్తులను ప్రారంభించనున్నాయని తెలిపారు.

సమావేశంలో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు, వాటికి మంజూరు చేయాల్సిన రాయితీలు మొదలైన అంశాలపై సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబ శివరావు, అనంత రాము, ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఐటి శాఖ కార్యదర్శి కె.శశిధర్, పరిశ్రమల శాఖ సంచాలకులు జెవిఎస్ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.