'ఖాళీలున్నా ఉద్యోగం ఇవ్వం' అంటే కడుపు మండదా?: సుంకర పద్మశ్రీ
'ఖాళీలున్నా ఉద్యోగం ఇవ్వం' అంటే కడుపు మండదా? అని సుంకర పద్మశ్రీ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ కేలండర్ చూసి యువతలో ఆశలు సన్నగిల్లాయి. ఉద్యోగాలు ఇవ్వం అని ప్రభుత్వం ప్రకటిస్తే లక్షలు ఖర్చు చేసి సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటున్న వారికి కడుపు మండదా? నిరసన తెలియజేయరా? నిరసన తెలియజేయడం నేరం కాదు కదా?
అధికార దుర్వినియోగం కాదా?
నిరుద్యోగులను కనీసం ప్రదర్శన చేయనివ్వరు. నిరసన దీక్ష చేయనివ్వరు. ధర్నా చేయనివ్వరు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరైతే ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల్లో, సభల్లో వందలు, వేల మందిని ఏ నిబంధనల ప్రకారం అనుమతిస్తున్నారు? యువకులకు, విద్యార్థులకు, ప్రజలకు వర్తించే నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా? జగన్ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగం కాదా?
ప్రభుత్వానికి ఎందుకంత కంగారు?
జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాటల పట్ల నిరుద్యోగ యువత ఎంతో నమ్మకంతో వున్నారు. జగన్ మాట తప్పరని, మడమ తిప్పరనే విశ్వాసంతో ఉన్నారు. జగన్ విడుదల చేసిన జాబులు లేని జాబ్ కేలండర్‌తో నిరాశకు గురయ్యారు. ఆ వెంటనే ఆర్థిక శాఖ 2.35 లక్షల ఖాళీలు వున్నాయని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయట పడడంతో నిరుద్యోగులకు కడుపు మండిపోయింది.
ప్రభుత్వంలో ఖాళీలు నింపమంటే నిర్బంధమా?
రాష్ట్ర ఆర్థిక శాఖ 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని చెప్పింది. 'ఖాళీలన్నీ నింపండి' అని నిరుద్యోగులు కోరుతున్నారు. ఖాళీలు లేకపోతే ప్రభుత్వం ఆ విషయం ప్రకటించాలి. ఆందోళనకు గురయ్యే యువతకు అదే చెప్పాలి. ఖాళీలు వుంటే ఎప్పుడు నింపుతారో చెప్పాలి. ఇది బాధ్యతాయుత ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయడం మాని ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి నిరసనను కూడా అణచివేయడం రాజ్యాంగ విరుద్ధం.