1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:39 IST)

టాస్క్ ఫోర్స్ దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

టాస్క్ ఫోర్స్ కు రాబడిన సమాచారం మేరకు తిరుమల అడవుల్లో ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్యకి అందిన సమాచారం తో మూడు బృందాలను, మూడు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు.

ఆర్ ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐ లు వాసు, లింగాధర్ టీమ్ శ్రీవారి మెట్టు సమీపంలో ఈతకుంట వద్ద ఎర్ర చందనం దుంగలు మోసుకుని వస్తున్న తమిళ స్మగ్లర్లు పై శుక్రవారం తెల్లవారుజామున దాడులు చేశారు.  అయితే స్మగ్లర్లు దుంగలను పడవేసి పారిపోయారు.

వీరు పడేసిన 11 దుంగలను స్వాధీనం చేసుకుని పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. అదే విధంగా కడపజిల్లా రాయచోటి వీరబల్లి మండలం లో వన్నెమాండ్ల అటవీ ప్రాంతంలో ఆర్ ఐ ఆలీ బాషా, ఆర్ ఎస్ ఐ రవికుమార్ ల బృందం 14 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని,  ఒకరిని అరెస్ట్ చేసి నట్లు తెలిపారు.

మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు కెవి బావి ప్రాంతంలో ఆర్ ఐ కృపానంద, ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య 13 ఎర్ర చందనం దుంగలను, స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఈ రెండు దాడులు అటవీశాఖ తో జాయింట్ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.తదుపరి విచారణ జరుగుతోందని అన్నారు. ఈ కేసులను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో సిఐ సుబ్రహ్మణ్యం కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.