20 లక్షల మంది యువతకు ఉద్యోగాల కోసం టీడీపీ "యువగళం"
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చేవరకు యువతకు నెలకు రూ.20 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. రాజకీయాల్లోనూ 40 శాతం మేరకు యువతకు ప్రాధాన్యమివ్వాలని తెదేపా నిర్ణయించింది.
రాష్ట్రంలోని యువతను ప్రపంచ ఆర్థికవ్యవస్థకు అనుసంధానం చేస్తాను. యువత తమకు ఉద్యోగాలు, మంచి భవిష్యత్తుకావాలో.. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలుకావాలో నిర్ణయించుకోవాలి. యువత ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు కులాలు, మతాల రొంపిలోకి దిగొద్దు. అబద్ధాలు చెప్పి, ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేవారిని నమ్మొద్దు. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుడిని యువత నమ్ముతుందా? యువత ఎక్కడికి వెళ్లినా మీ రాజధాని ఏదని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? అని చంద్రబాబు యువతను సూటిగా ప్రశ్నించారు.
"కులం, మతం, ప్రాంతం పేరుతో ఎవరైనా విభేదాల సృష్టిం చేందుకు ప్రయత్నిస్తే చెప్పుతో కొట్టాలని, అప్పుడే వారికి బుద్ధిస్తుందని ఆయన పిలుపునిచ్చారు. 'యువతకు కావలసింది భవిష్యత్తు, ఈ ఆధునిక సమాజంలో, నాలెడ్జ్ ఎకానమీలో ఇంకా అలాంటివి పెట్టుకుని నాశనమైపోవడం ఎంతవరకూ సబబో ఆలోచించండి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.