చంద్రబాబు కంటతడి.. మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానంటూ భీష్మ శపథం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అధికార పార్టీకి చెందిన సభ్యులు నిండు అసెంబ్లీలో అగౌవరంగా మాట్లాడారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి గురించి వారు అసభ్యంగా మాట్లాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు ఆయన బీష్ణ ప్రతిజ్ఞ చేశారు. మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే సభలో అడుగుపెడతానని శపథం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా సభ్యులు టీడీపీ చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మంత్రి కొడాలి నాని తీవ్ర పరుష పదజాలంతో రెచ్చిపోయారు. చంద్రబాబును లుచ్ఛా అన్నారు. మరోమంత్రి కన్నబాబు, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు తమదైనశైలిలో విరుచుకుపడ్డారు.
సభలో ఉన్న చంద్రబాబును విమర్శించడమేకాకుండా ఆయన భార్యపై సైతం నోరు పారేసుకున్నారు. నారా భువనేశ్వరితో పాటు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడిపెట్టారు. అనంతరం ఆయన తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
"ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో, నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి (మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు) అవమానించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.