సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (09:08 IST)

ద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలి : టీడీపీ నేత వర్మ డిమాండ్

varma svsn
వైకాపాకు చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్పడిన అవినీతిపై తక్షణం విచారణకు ఆదేశించాలని కోరుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయించారని, కోట్లాది రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 
 
కాకినాడ నగర ప్రజల ఇళ్ళ పట్టాల కోసం కొత్తపల్లి మండలం కొమరిగిరిలో 350 ఎకరాల భూమిని సేకరించారని, ఈ భూమిని చదును చేయడటం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్టు రికార్డు పత్రాల్లో చూపించి అవినీతికి పాల్పడ్డారని వర్మ ఆరోపించారు. 
 
13 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి తన బినామీలకు మాత్రమే ఇళ్ల పట్టాలను ఇచ్చారని, ఆ తర్వాత ఆ స్థలాలను అక్రమంగా విక్రయించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కొత్తపల్లి మండలి మత్స్యకారులకు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.