మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (07:36 IST)

రైతుల ఇళ్లలో సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం: టీడీపీ

ప్రజా రాజధాని అమరావతి పరిధిలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హ‌ణీయమని, అర్ధరాత్రి దాటాక రైతుల ఇళ్లలోకి వెళ్లి వారిని భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు.

ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "ఉగ్రవాదులను పట్టుకోవడానికి వెళ్లినట్లు అర్ధరాత్రి వెళ్లి రాజధాని కోసం  భూములు దారాదత్తం చేసిన రైతుల ఇళ్లలోకి చొరబడతారా.? ఆధార్‌ కార్డు ఉంటేనే స్వగ్రామాల్లోకి అనుమతిస్తారా.? లేదంటే పొలిమేరల్లోనే అడ్డుకుంటారా.? శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై అక్రమ కేసులు పెడతారా.? ఆంక్షల పేరుతో ఉద్యమాన్ని అడ్డుకోవడం నిరంకుశత్వం. అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో అనే విషయం గుర్తుందా?

ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం.. వారి గొంతు నొక్కేలా వ్యవహరిస్తుంటే.. ప్రశ్నించడం తప్పా.? ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా కాకుండా నిరంకుశత్వంగా, నియంత మాదిరిగా అణచివేయాలని చూస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. వేధింపులు, అణచివేతలు వంటి చర్యలతో ప్రజా ఉద్యమాలను ఆపడం ఎవరి వల్లా సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి.

చరిత్రలో నియంతలెవరూ ప్రజా ఉద్యమాల ముందు నిలవలేకపోయారు. ప్రజా ఉద్యమాలకు, వారి తిరుగుబాటుకు దేశాలు, రాజ్యాలే కూలిపోయాయి. మీరెంత..? ప్రజలపై విజ్ఞత చూపించాల్సిన ప్రభుత్వం.. పగలు, ప్రతీకారాలు, విధ్వేషాలు చూపడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు. రైతుల విషయంలో మీ అమానుష వ్యవహార శైలిని మార్చుకోకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుంచుకోండి" అని హెచ్చరించారు.
 
"ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌ తుగ్లక్‌ విధానాలకు తలూపితే తమ రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నట్లేనని గుర్తుంచుకోండి. మీ వేధింపులు, సాధింపులను ప్రజా తిరుగుబాటు తిప్పికొడుతుంది. జగన్మోహన్‌ రెడ్డి రూ.లక్ష కోట్ల ప్రజా సంపదను దోచుకుంటే.. చంద్రబాబు నాయుడు ప్రజల కోసం రూ.లక్ష కోట్ల ఆస్తి సృష్టించారు.

అమరాతిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అయిన అమరావతిపై వైసీపీ నేతలు నిందలేసి సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌కు పునాదులు వేసుకుంటున్నారని గుర్తించాలి. ఐదు కోట్ల ఆంధ్రుల ఏకాభిప్రాయంతో ఏర్పాటైన రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం మళ్లీ కమిటీలు వేయటం విడ్డూరంగా ఉంది. జగన్‌ మాటలు కమిటీల చేత చెప్పించేందుకు జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీ, హైపవర్‌ కమిటిలంటూ డ్రామాలాడుతున్నారు.

జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ కమిటీల నివేదికను అధ్యయనం చేసేందుకు హైపవర్‌ కమిటి వేశారు. అంటే జీఎన్‌ రావు కమిటి లోపవర్‌ కమిటీనా? అలా అయితే లోపవర్‌ కమిటీ 3 రాజధానులుండాలని సూచిస్తే ఈ హైపవర్‌ కమిటి 6 రాజధానులుండాలని చూసిస్తుందేమో? ఎంతయినా హైవపర్‌ కమిటీ కదా. 

రాజధానిపై ఇలా కమిటీల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని అపహాస్యం చేస్తూ..ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. నిజంగా రాష్ట్రాభివృద్ది, ప్రజాసంక్షేమం కోరుకునే వారెవరు ఈ విధంగా వ్యవహరించరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసేందుకు నేను సిద్ధం. వైసీపీ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్దమా? అమరావతి పరిధిలోని ప్రజలకు, రైతులకు వైసీపీ నేతలు.. ప్రభుత్వం చేసిన ద్రోహం చాలు.

ఇంకా చేస్తే చరిత్ర  హీనులవుతారు. రాజధాని తరలింపునకు సహకరిస్తే వైసీపీ మంత్రలులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు.మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లేసిన ప్రజలంతా రాజధాని మార్చొద్దని ముక్త కంఠంతో నినది ిస్తున్నారు. రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మహానగర నిర్మాణంలో భాగస్వాములవ్వాలనే కాంక్షతో తమ ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులకు ఇవ్వాల్సింది ప్లాట్లు కాదు. ప్రజా రాజధాని.

అలాంటి ప్రజల రాజధానిని మార్చి ప్లాట్లు ఇస్తే రైతులు వాటిని ఏం చేసుకోవాలి.? రాజధాని మార్పుపైన ఇంత రాద్దాంతం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎందుకు ప్రజల ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వకుండా.. పరోక్షంగా జగన్‌ కు మద్దతు తెలుపుతున్నారు.

జగన్‌ కావాలో.. నియోజకవర్గ జనం కావాలో.. ఎమ్మెల్యే ఆర్కే తేల్చుకునే సమయం వచ్చింది. అమరావతి కొనసాగింపునకు మద్దతుగా ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయాలి. నవ్యాంధ్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కన్నా వ్యక్తిగత భవిష్యత్తే ముఖ్యమని భావిస్తే చరిత్రలో వైసీపీ కనుమరుగవ్వడం ఖాయం" అని మండిపడ్డారు.